ఢిల్లీలో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌ జితేంద్ర నాథ్‌ పాండే(78) శనివారం కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా..  రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ మెడికల్ కాలేజీ డీన్, యూరాలజీ విభాగం అధిపతి రాజీవ్ సూద్ కరోనా వైర‌స్‌ బారిన‌ప‌డ్డారు. డాక్టర్ రాజీవ్ సూద్‌కు క‌రోనా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీంతో డాక్టర్ రాజీవ్ సూద్ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో అత‌నితో సం‌బంధం ఉన్న‌వారంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్‌లో క‌రోనా రోగుల‌కు ఆయ‌న‌ చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండంతోపాటు ఆరోగ్య కార్యకర్తలు కూడా కరోనా వైరస్ బారిన ప‌డుతున్నారు. ఇటీవలే ఆర్‌ఎంఎల్ డాక్టర్ క్యాంటీన్‌లో 14 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. 20 మందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇదిలా ఉండ‌గా.. నిన్న‌ ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌ జితేంద్ర నాథ్‌ పాండే మృతి చెంద‌డంతో తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

 

గత కొన్ని వారాల నుంచి కరోనా బాధితులకు జితేంద్ర నాథ్‌ పాండే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్‌ సోకి మృతి చెందడం క‌ల‌క‌ల రేపుతోంది. పల్మనాలజీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా జితేంద్ర నాథ్‌ కొనసాగుతున్నారు. డాక్టర్‌ పాండే భార్యకు కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే పాండేకు కరోనా సోకినప్పటి నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడించారు. పాండే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అనుకున్నారు.. కానీ..నిన్న రాత్రి ఆయన భోజ‌నం‌ చేసిన తర్వాత.. నిద్రకు ఉపక్రమించి.. నిద్ర‌లోనే కన్నుమూశారు అని గులేరియా స్పష్టం చేశారు. డాక్టర్‌ పాండే మృతి పట్ల ఎయిమ్స్‌ వైద్యులు, సిబ్బంది నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. పాండే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: