రోజులు.. సరిగ్గా రెండు నెలల క్రితం మహమ్మారిని అడ్డుకునేందుకు పెట్టిన లాక్‌డౌన్.. మానవ జీవన శైలినే మార్చేసింది. కూలీ నుంచి మిలీనియర్ వరకు అందరి జీవనాన్ని తలకిందులు చేసేసింది. హార్డ్ వేర్, సాఫ్ట్‌ వేర్.. ఎనీ వేర్ ఓన్లీ పర్సనల్ కేర్ అనేలా అన్నింటిలో టెన్షన్ పెట్టేసింది. ఆర్ధికంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపింది.

 

ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి ప్రభావం ప్రతీ వ్యవస్థపై పడుతోంది. సరిగ్గా 60 రోజుల క్రితం మార్చి 23కు మందు ప్రజలెవ్వరూ ఇలా జీవితాన్ని ఆంక్షలతో గడపుతామని అనుకోలేదు. ఇప్పుడిప్పుడే తత్వం బోధపడడంతో.. అలవాట్లను మార్చేసుకున్నారు ప్రజలు. ఈ వైరస్ ఇప్పటికిప్పుడు పోయేది కాదని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రత, ఆహారపు అలవాట్లను మార్చేసుకున్నారు. ఈ ప్రభావంతో అనేక వ్యవస్థలు కుదేలుకానున్నాయి. షాపుల వద్ద రద్ధీ లేదు.. ఆసుపత్రులు కిటకిటలాడడం లేదు.

 

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ మే 31కి ముగిసే అవకాశమే కనిపిస్తోంది. లాక్‌డౌన్ ముగిసినా.. ముగియకున్నా.. సాధారణ జీవన పరిస్థితులు, వ్యాపారాలు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రంగంలోని వ్యక్తులు ఆరోగ్యం కోసం టెన్షన్ పడుతున్నారు. పురోగతి మాట పక్కన పెట్టి పూర్వపు స్థితి ఎప్పటికీ వస్తుందనే దానిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం అటుంచితే.. కరోనాను కట్టడి చేయగలిగిందా.. అనే ప్రశ్నే ఎక్కువగా ఉంది.

 

ప్రతి రోజు సగటున 50 నుంచి 60 కేసులు తెలంగాణలో నమోదవుతున్నా.. ఒక్క రాజధాని నగరం తప్ప మిగిలిన జిల్లాలన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కొత్త కేసులు రాకపోవడం ఊరటనిచ్చే విషయం. పల్లె జనమంతా వ్యవసాయ పనులకు సిద్ధపడుతున్నారు. అయితే, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలసకూలీల్లో వైరస్ బయట పడడం టెన్షన్‌ పెడుతోంది. వెళ్లేవారు వెళ్తుండగా.. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు.. దీంతో పనులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగదనే చెప్పాలి.

 

అయితే ఎక్కువ పనులు జరిగే గ్రేటర్ మాత్రం వైరస్ గుప్పిట్లో వణికిపోతోంది. గత రెండు వారాల్లో ఇక్కడ 500 కేసులు నమోదు కావడం.. సామాన్యుని పనితీరుకు అడ్డం పడుతూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముగ్గురు పోలీసు అధికారులకు కూడా కరోనా సోకడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

 

కోవిడ్ కేసుల ట్రీట్‌మెంట్‌లో పాక్షిక లక్షణాలున్న వారిని.. అధికారులు ఇంటి వద్దనే ఉంచి పర్యవేక్షిస్తున్నారు. దీని వల్ల వారి కుటుంబ సభ్యులు కోవిడ్ భారిన పడుతున్నారని గ్రహించిన అధికారులు.. వారిని కూడా ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ఇక, కరోనా వైరస్ ప్రతి కుటుంబ ఆర్ధిక పరిస్థితిని పూర్తిగా చిక్కుల్లోకి నెట్టింది. ఫుట్‌పాత్ వ్యాపారాలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రైవేటు సంస్థలకు మోత పడుతుండడంతో అనేక ఉద్యోగాలుపోతున్నాయి.

 

సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రత్యేక సడలింపులు ఇచ్చినా.. టెక్కీలు కరోనా భయంతో ఆఫీసులకు రావడం లేదు. మెట్రో రైలు, సిటీ బస్సులు కదలకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మే 31 తర్వాత అవి కదిలితే పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. కిక్కిరిసిన క్యూ లైన్లుండే పరిస్థితి ఇక ఉండదంటున్నారు.

 

మరోవైపు.. విద్యావ్యవస్థ స్తంభించింది. పరిక్షలన్ని అటకెక్కగా.. మెల్లగా ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిక్షల తేదీలు.. చదువులకు సన్నద్ధం కావాల్సిన అసరాన్ని చెబుతన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ఎలా ఉంటుందో.. ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఏదైనా.. అందరూ చెబుతున్న మాట మాత్రం ఒక్కటే పరిస్థితులు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: