మే 25 నుంచి  దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.  ప్రయాణీకుల రాక, పోకలపై పూర్తి కంట్రోల్ పెడుతున్నారు. సోషల్ డిస్టన్స్, మాస్క్, శానిటైజర్ వాడకం ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ... ఎయిర్‌పోర్టులను సిద్ధం చేస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో .. అంతర్రాష్ట్ర సర్వీసులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ప్రయాణీకులను క్వారంటైన్ ఉంచాలంటూ పట్టుబడుతున్నాయి.  అయితే క్వారంటైన్‌ కానీ, ఐసోలేషన్ కానీ అవసరం లేదని తేల్చి చెబుతోంది విమానయానశాఖ.

 

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన విమాన ప్ర‌యాణాలు మ‌ళ్లీ మొద‌లుకాబోతున్నాయి. సోమవారం నుంచి దేశంలో డొమెస్టిక్ విమాన స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ ప్ర‌క‌టించింది.  అయితే విమాన ప్ర‌యాణాల సంద‌ర్భంగా ప్ర‌యాణీకులు, ఎయిర్ పోర్టు అధికారులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై స్టాండ‌ర్డ్ ఆప‌రేష‌న్ ప్రొటోకాల్ ను పౌర విమాన‌యాన శాఖ విడుద‌ల చేయబోతోంది. అయితే అన్ని మార్గాల్లో ఒకేసారి విమాన సర్వీసులు మొద‌లు పెట్టడం లేదని విమానయాన శాఖ తెలిపింది. ద‌శ‌ల వారీగా విమానాల‌  ఆప‌రేష‌న్స్ పెంచుతూ వెళ్తామ‌ని చెప్పింది.


  
క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా మార్చి 21 నుంచి లాక్ డౌన్ విధించ‌డంతో అన్ని ర‌కాల ర‌వాణా సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు నెల‌న్నర తర్వాత ఇటీవ‌ల 15 ప్ర‌ధాన రూట్ల‌లో రైళ్ల‌ను స్టార్ట్ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. వ‌చ్చే నెల 1 నుంచి 200 రైళ్లను అన్ని రాష్ట్రాల మ‌ధ్య‌ స‌ర్వీసుల‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మే 18 నుంచి లాక్ డౌన్ 4.0లో ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన కేంద్రం.. ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డిపేందుకు రాష్ట్రాల‌కు స్వేచ్ఛ‌నిచ్చింది. దీంతో ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఆర్టీసీ స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేశాయి. అయితే అంత‌ర్రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌ను మొద‌లు పెట్టేందుకు దాదాపు ఏ రాష్ట్రం కూడా ఆస‌క్తి చూలేదు. ఇక‌ ఇప్పుడు తాజాగా దేశీయంగా రాష్ట్రాల మ‌ధ్య విమాన స‌ర్వీసులు షురూ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. అంతర్రాష్ట్ర సర్వీసులకు కేంద్రం సై అనడంపై ప్రజలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


  
అయితే అంతర్రాష్ట్ర విమాన సర్వీసులపై ఎలాంటి ఆందోళన అసరంలేదని భరోసా ఇస్తున్నారు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పూరీ.  ఆరోగ్య సేతు యాప్‌లో 'గ్రీన్' స్టేటస్‌ చూపిస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని  స్పష్టం చేశారు.  ఆన్‌లైన్‌ ద్వారా నెటిజన్ల అనుమానాలను నివృత్తి చేశారు కేంద్ర మంత్రి. ఆగష్టు, సెప్టెంబరు కంటే ముందే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విదేశీ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.   తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రయాణికులను క్వారంటైన్ ఉంచాలంటూ పట్టుబడుతున్నాయి. దానిపై ఆన్‌లైన్‌ చర్చలో కొందరు ఆందోళన వ్యక్తం చేయగా..క్వారంటైన్‌ కానీ, ఐసోలేషన్ కానీ అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి.

 

వైరస్‌ వ్యాప్తి తొలిదశలో ఉన్నప్పుడు సకల దిగ్బంధాలూ చేసిన ప్రభుత్వాలు.., కేసులు లక్ష దాటిన సమయంలో తలుపులు బార్లా తెరిచాయి. ఓవైపు కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నా.. శ్రామిక రైళ్లు, ప్రత్యేక రైళ్లతో పాటు, మే 25 నుంచి దేశీయ విమానాలు, జూన్‌ ఒకటి నుంచి 200 ప్యాసింజర్‌ రైళ్లను నడపడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యవంతులైన వృద్ధులను కూడా ప్రయాణానికి అనుమతిస్తామని తెలిపింది. కొన్ని రాష్ట్రాల అభ్యంతరాలను, ఆందోళనలను కొట్టిపారేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: