క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. ఈ మ‌హ‌మ్మారి సృష్టించిన విప‌త్కర ప‌రిస్థితుల్లో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటూనే వైర‌స్ వ్యాప్తి నిరోధానికి కట్ట‌దిట్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తోంది. తాజాగా.. ఏపీ స‌ర్కార్ మ‌రోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా రికార్డులు సృష్టించింది. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో, క‌రోనా వైర‌స్ నుంచి రివ‌క‌రీ రేట్‌లోనూ మ‌రోసారి ఏపీ ముందంజ‌లో నిలిచింది. ఆదివారం విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగుచూశారు. ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆత్మ‌విశ్వాసం పెంపొందించే అంశాలు వెల్ల‌డ‌య్యాయి. ఏపీ వైద్యారోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో కొత్తగా 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2627కు చేరింది. గడిచిన 24 గంటల్లో 11,357 మంది సాంపిల్స్‌ పరీక్షించగా కేవ‌లం 66 మందికి మాత్ర‌మే కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగ కొత్తగా 29 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

 

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1807కు చేరింది. ఇదొక రికార్డు అని విశ్లేష‌కులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రికార్డ్ స్థాయిలో 68 శాతంగా ఉంది. రిక‌వ‌రీ రేట్ ఈ స్థాయిలో ఉండ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని, ప్ర‌జ‌ల్లో ఆత్మ‌స్థైర్యం పెంపొందిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇంత వేగంగా మ‌రే రాష్ట్రంలోనూ క‌రోనా పేషెంట్లు కోలుకోవ‌డం లేద‌ని అంటున్నారు. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ సాధించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3లక్షల 4వేల 326 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక‌ ఏపీలో కరోనా మృతుల సంఖ్య 56గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 764 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  తాజాగా నమోదైన కేసుల్లో 17 విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. కాగా 8 జిల్లాల్లో ఐసోలేషన్, ఆక్సిజన్ బెడ్లను ఏపీ ప్రభుత్వం పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌నీసం 30వేల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కూడా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: