కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో చైనా దేశం నుండి అనేక విదేశీ కంపెనీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలోల‌ భారత్‌లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భార‌త్‌లో అయితే త‌మ పెట్టుబ‌డుల‌కు ఎలాంటి డోకా ఉండ‌ద‌ని, ఇక్క‌డ సుర‌క్షితంగా కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌వ‌చ్చున‌ని అనుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల చైనాలో ఉన్న జర్మనీకి చెందిన ప్ర‌ముఖ షూల‌ కంపెనీ బ్రాంచ్‌ను భారత్ లోని ఆగ్రా లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో దిగ్గజ కంపెనీ చేరుతున్నట్టు తెలుస్తోంది. చైనాలో ఉన్న యాపిల్ బ్రాంచ్‌ను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇక్క‌డే ఐఫోన్ల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అడ్డు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనా నుంచి బయటకు వస్తున్న అమెరికా కంపెనీలు కూడా మొదట అమెరికాకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడే ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అమెరికా పౌరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆయన ప్రకటించడం గమనార్హం. లేనిపక్షంలో ఇతర దేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేస్తే అధిక పన్నులు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

 

నిజానికి గత ఎన్నికల్లో కూడా ట్రంప్‌ ఒక నినాదంతో గెలిచాడు. అది ఏమిటంటే మొదట అమెరికన్లు ఆ తరువాత మిగతా వాళ్లు. ఇప్పుడు కరోనా వైరస్ కష్టకాలంలో మొదట అమెరికన్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే మిగతా వారని ట్రంప్ అంటున్నారు. ఇందులో భాగంగానే చైనా నుంచి భారత్‌కు రావాలనుకుంటున్న యాపిల్‌ సంస్థ బ్రాంచ్‌ను అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ముందు ముందు మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: