ఉన్న వాళ్లకు ఓ న్యాయం.. లేని వాళ్లకు మ‌రో న్యాయం.. అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితి అధ్వానంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనులు ఉంటున్న క్వారంటైన్ సెంటర్ను అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. కనీసం వారికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం లేదని, ఆహారం కూడా అందించడం లేదని పలువురు గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. విశాఖపట్నం జిల్లా అనంతగిరి ప్రాంతానికి చెందిన పిల్ల‌లు పెద్ద‌ల‌తో క‌లిసి సుమారు 250 మంది గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ప్రాంతంలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ విధించడంతో వీరందరూ ఇక్కడే చిక్కుకుపోయారు.

 

వీరికి ఇటుక బట్టీల యాజమాన్యాలు కూడా ఎటువంటి సాయం అందించలేదు. త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో అక్కడే తీవ్ర ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు. అయితే.. వీళ్లను అధికారులు ఎట్టకేలకు ఈనెల 13 అనంతగిరికి తరలించారు. అక్కడే ఓ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు అందులో ఉంచుతున్నారు. అయితే ఈ క్వారంటైన్‌ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ గిరిజనులే కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆహారం కూడా వండి పెట్టడం లేదని గిరిజనులే స్వయంగా సాంబారు అన్నం వండుకుని తింటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

 

ఇలా ఏపీ సర్కార్ వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. సెంటర్లో సుమారు 20 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరికి అవసరమైన పౌష్టికాహారం కూడా అధికారులు అందించడం లేదని తెలుస్తోంది. గిరిజనులు కావడం వల్లనే ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి సారించి గిరిజనుల కష్టాలను తీర్చాలని పలువురు కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: