కరోనా వైరస్ కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పేదలకోసం నగదుతో పాటు బియ్యం, పప్పులు కూడా అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున నగదు, బియ్యం అందించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పేదలకు పదిహేను వందల రూపాయల చొప్పున రెండు నెలలు అందించింది. అలాగే.. 12 కిలోల‌ బియ్యం కూడా ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు అందజేసి, బియ్యం కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 19 లక్షల 67 వేల 484 మంది భవన నిర్మాణ కార్మికులు అధికారికంగా నమోదయి ఉన్నారు.

 

ఇక్కడ వీరికి సంబంధించి ప్రత్యేకంగా సంక్షేమ నిధి కూడా ఉంది. ఈ సంక్షేమ నిధిలో 1856 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలతో  రూ.196 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. అంటే ఇంకా చాలా డబ్బు మిగిలే ఉందన్నమాట. లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణాలు ఆగిపోవడంతో కార్మికులు చేతిలో పని లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక రోజులుగా కొందరు కార్మికులు ప‌స్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు అప్పులు చేసి తమ కుటుంబాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి మరి కొన్ని డబ్బులు కూడా కార్మికులకు ఇచ్చే అవకాశం ఉంది.

 

మరో రెండు మూడు వేల రూపాయలు కూడా ఇవ్వొచ్చని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు మాత్ర‌మే ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కష్టాలను దృష్టిలో పెట్టుకొని వారికి మరికొంత డబ్బు అందజేయాలని పలువురు విశ్లేషకులు కోరుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: