దేశంలో, రాష్ట్రాల్లో సంవత్సరాలకు సంవత్సరాలు పాలన సాగించిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కొన్ని విషయాల్లో ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు. ఆ ప్రత్యేకతే వారికి చాలా సందర్భాల్లో మంచిపేరు తెచ్చిపెడుతూ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విజన్ ఉన్న నాయకుడిగా, టెక్నాలజీని అందిపుచ్చుకునే అలవాటు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
చంద్రబాబు సీఈవో తరహా పాలన చేశారని అధికార యంత్రాంగంతో సమీక్షలు, ప్రజల్లోకి వెళ్లటం ద్వారా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా టీడీపీ మరో చారిత్రక ఘట్టానికి తెర తీస్తోంది. టీడీపీ ఆన్ లైన్ లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 14,000 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలోని పాల్గొననున్నారని తెలుస్తోంది. జూమ్ యాప్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. 
 
ప్రపంచ చరిత్రలోనే యాప్ ద్వారా ఇంతమంది సమావేశం కావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ నెల 27, 28 తేదీల్లో ఆరు గంటలకు ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ముఖ్య నేతలు మహానాడు గురించి భేటీ అయ్యారు. 
 
టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు సమావేశంలో భేటీ అయ్యారు. టెక్నాలజీ విషయంలో మాత్రం చంద్రబాబును మెచ్చుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.                                 
 

మరింత సమాచారం తెలుసుకోండి: