తెలంగాణ‌లోని అన్ని రంగాల్లోనూ స‌మూల‌మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే వ్య‌వ‌సాయ రంగంలో పంట‌ల సాగువిధానంపై ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక నుంచి నియంత్రిత ప‌ద్ధ‌తిలోనే రైతులు పంటలు సాగుచేయాల‌ని, ప్ర‌భుత్వం చెప్పిన పంట‌ల‌నే రైతులు పండించాల‌ని, అప్పుడే మంచి ధ‌ర‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆమేర‌కు కార్యాచ‌ర‌ణ కూడా మొద‌లు పెట్టారు. అలాగే.. క్రీడారంగంలో కూడా కీల‌క మార్పులు తెస్తార‌నే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ రోజు వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

 

తెలంగాణ‌ రాష్ట్రంలో సరికొత్త క్రీడాపాలసీని అమలులోకి తీసుకురానున్నట్లు క్రీడలు, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. వరంగల్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్‌) ప్రాంగణంలో రూ. 7 కోట్లతో ఏర్పాటు చేయనున్న సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ పనులకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను చెప్పారు. క్రీడారంగంలో వరంగల్‌ జిల్లాకు ప్రత్యేకస్థానం ఉందని,  ఇక్కడి నుంచి ఎంతో మంది క్రీడాకారులుఅంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. వారి బాటలోనే యువ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో సింథటిక్‌ ట్రాక్‌ని  ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్రంలో క్రీడారంగానికి పెద్దపీట వేయాలనే ధృడ సంకల్పంతో సీం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇటీవల సబ్‌కమిటీ వేశామని, ఇందులో క్రీడా విధివిధాలపై కమిటీలో చర్చించి ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో త్వరలోనే క్రీడాపాలసీ రాష్ట్రంలో అమలులోకి వచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు క్రీడా విశ్లేష‌కులు చెబుతున్నారు. నిజానికి.. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాకాలతో పాటు మౌలిక సదుపాలయాను రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించారు. రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో క్రీడాప్రాధికార సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ క్రీడాకారుల‌కు మ‌రిన్ని మంచిరోజులు వ‌స్తాయ‌న్న‌మాట‌. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: