వరంగల్ శివారులోని గొర్రెకుంట బావిలో మృతదేహాలు లభ్యం కావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతదేహాలు లభ్యం కావడంతో పాటు మరికొంత మంది మృతదేహాలు కూడా ఈ బావిలో వెలికి తీయబడ్డాయి . రెండు రోజుల పాటు ఈ మృతదేహాల వెలికితీత చేపట్టారు అధికారులు. బావిలో ఉన్న నీటిని ఎత్తిపోస్తున్న  కొద్దీ ఒక్కో మృతదేహం బయటపడుతూ వచ్చింది. ఈ ఘటన ఎలా జరిగింది అనేది కూడా మిస్టరీ గా మారిపోయింది. అయితే ఈ ఘటన ఏకంగా పోలీసులను.. స్థానికులను షాక్ కి  గురి చేసింది . ఇక ఒక్కసారిగా తొమ్మిది మృత దేహాలు ఓకే బావి  నుంచి బయటపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

 


 అయితే బావిలో 9 మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు దొరికిన ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకుని వారికి ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇక వీరిలో ఒకరు యాకుబ్... మృతురాలు బుస్రా  ఖాతూన్ ప్రియుడు గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో ఇద్దరు సంజయ్ కుమార్,  మంకు షా అనే  బీహార్కు చెందిన కార్మికులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

 మరోవైపు ఈ తొమ్మిది మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు . పోస్టుమార్టం పూర్తి కావడంతో మృతదేహాలకు సంబంధించిన నివేదిక పోలీసుల చేతికి వెళ్ళింది.. అయితే అందరూ నీటిలో మునిగి బావిలోనే ప్రాణాలు వదిలినట్లు ఈ పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడయ్యింది. ఇక వారి ఉదర భాగాల నుంచి సేకరించిన నమూనాలను ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షిస్తున్నారు నిపుణులు. ఇక ఈ నివేదిక వస్తే వారిపై ఏమైనా విషప్రయోగం జరిగిందా అనే  విషయం కూడా తేటతెల్లంగా ఉంది. కాగా ఈ బావిలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా కనిపించకపోవటం  ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: