కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరబాద్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే లేఖలు, మీడియా సమావేశాల ద్వారా జగన్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూనే, విమర్శలు చేస్తున్నారు. అయితే బాబు ఏపీ ప్రతిపక్ష నేత అయి ఉండి హైదరబాద్‌లో ఉండటమేంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ ప్రకారమే అక్కడ ఉన్నారని తమ్ముళ్ళు చెబుతున్నారు.

 

ఈ క్రమంలోనే ఇటీవల విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, సీఎం జగన్, ఇంకా పలు పార్టీ నేతలు అక్కడకి వెళ్ళి బాధితులని పరామర్శించారు. అయితే బాబు కూడా అదే రోజు విశాఖ వెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. ఏమైందో తెలియదు గానీ అప్పుడు బాబుకు పర్మిషన్ రాలేదు. దీంతో కొన్ని రోజులు ఆ విషయం వదిలేసి..తాజాగా మళ్ళీ విశాఖ వెళ్ళేందుకు పర్మిషన్ ఇవ్వాలని, తెలంగాణ, ఏపీ డీజీపీలకు బాబు లేఖ రాశారు.

 

అయితే తెలంగాణ డీజీపీ దగ్గర నుంచి వెంటనే అనుమతి వచ్చింది కానీ ఏపీ డీజీపీ దగ్గర నుంచి రాలేదు. దీంతో టీడీపీ నేతలు ఫైర్ అయిపోయారు. తెలంగాణ పోలీసులు వెంటనే అనుమతి ఇస్తే ఏపీ డీజీపీ ఇంతవరకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలనుకోవటం తప్పా అని ప్రశ్నించారు. అయితే తర్వాత డీజీపీ నుంచి పర్మిషన్ రావడంతో టీడీపీ నేతలు చల్లబడ్డారు.

 

కాకపోతే బాబుని ఇబ్బంది పెట్టడానికి విశాఖలో వైసీపీ శ్రేణులు సిద్దంగా ఉంటాయని, వాటిని ఎలాగైనా తిప్పికొట్టాలని తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ అలా అడ్డుకోవడమే టీడీపీకి ప్లస్ అయ్యి, వైసీపీ ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుందని చెబుతున్నారు. మరి చూడాలి విశాఖ పర్యటనలో బాబుకు ఎలాంటి అనుభవం ఎదురవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: