జగన్ పాలన మొదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. టీడీపీతో మొదలు పెడిత చిన్నాచితకా పార్టీలు సైతం జగన్‌పై ఫైర్ అయిపోతున్నాయి. అసలు ఏడాది పాలనంతా దరిద్రమని, ఏపీకి శని పట్టి ఏడాది అయిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ నేత నారాయణ కూడా జగన్‌పై విమర్శనస్త్రాలు సంధించారు.

 

చంద్రబాబు, వైఎస్ చేసిన దానిలో పది శాతం కూడా జగన్ చేయడం లేదని, ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర జగన్ తాకట్టు పెట్టాడని, మూడు రాజధానుల కాన్సెఫ్ట్‌తో జాతీయ స్థాయిలో చులకనయ్యాడని, తానిచ్చిన నవ రత్నాల హామీని‌ సైతం అమలు చేయలేకపోయారంటూ విమర్శించారు. జగన్ పాలనపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చివరిలో ఓ డైలాగ్ వేశారు. అయితే సీపీఐ నారాయణ చెప్పినట్లుగా జగన్ ఈ ఏడాది పాలనంతా అలాగే సాగితే, ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ, రోడ్లుపైకి నిరసన తెలియజేయాలి. కానీ ఈ ఏడాది కాలంలో అలాంటి ఘటనలు ఏమి జరగలేదు.

 

పైగా నవరత్నాలు అమలు చేయలేదని, బాబు, వైఎస్ చేసిన దానిలో పది శాతం కూడా చేయలేదంటున్నారు. అసలు ఈ ఏడాది కాలంలో జగన్...ప్రజలపై సంక్షేమ పథకాల జల్లు కురిపించారు. బాబు ఎలాగో సంక్షేమం అమలు చేయడంలో వెనుకే ఉంటారు కాబట్టి...జగన్, వైఎస్సార్ కంటే కొంచెం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేసి, తండ్రిని మించి తనయుడు అనిపించుకున్నారు.

 

అటు ప్రత్యేక హోదా ఏమి మోదీ కాళ్ళ దగ్గర పెట్టలేదు. కాకపోతే కేంద్రంలో మోదీ పూర్తి మెజారిటీలో అధికారం ఉండటం వల్ల, తమ మాట చెల్లకపోవచ్చని చెప్పారు. అలా అని ప్రత్యేక హోదా పక్కనబెట్టకుండా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్రప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. ఇక అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడానికి, అభివృద్ధి చేయడానికి మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి ఏపీ ప్రజల పూర్తి మద్ధతు దక్కింది. ఇక ఏపీ ప్రజలు జగన్ పాలన పట్ల కోపంతో ఉన్నారో లేదో, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: