పది భోజనాలతో సమానం...హైదరాబాద్‌కు మాత్రమే ప్రత్యేకమైన వంటకం... ముస్లిం సోదరులకే కాదు అన్ని మతాల వారిని అలరించిన హలీంను  ఈ ఏడాది కరోనా మింగేసింది.  హలీం బట్టీలు ఈ సారి ఎక్కడా వెలగలేదు. వేల కోట్ల రూపాయల హలీం ఆదాయాన్ని కోవిడ్‌ వైరస్‌  హాంఫట్ చేసింది. నిజాం కాలంలో ప్రారంభమైన హలీం సంప్రదాయాన్ని మహమ్మారి ఒక్కసారిగా మటుమాయం చేసింది.

 

పవిత్ర రంజాన్‌ మాసం మొదలవ్వడానికంటే ముందే హైదరాబాద్‌ మహానగరంలో హలీం బట్టీలు వెలుగుతాయి. నెల మొత్తం హలీం హవానే కొనసాగుతుంది. బడా సంస్థల నుంచి మొదలు అసంఘటిత రంగ వ్యాపారుల వరకు హలీమ్‌ తయారీలో తలమునకలై హలీం ప్రియులకు వేడివేడిగా అందించేవాళ్లు. రెస్టారెంట్లు, హోటళ్లు.. పిస్తా హౌజ్‌లు ఒక్కటేమిటి హైదరాబాద్‌లో వీధి వీధీ హలీం ఘుమఘుమలతో ఘాటెక్కిపోయేది. 

 

ఇలాంటి హలీం ఘన చరిత్రకు కరోనా  మహమ్మారి గండి కొట్టింది. రుచికరమైన, పౌష్టికాహారమైన హలీమ్‌కు హైదరాబాదీలను దూరం చేసింది. ఆన్‌లైన్‌లో ట్రై చేసి  దొరికితే కొంత జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడం తప్ప ఈ ఏడాది హైదరాబాద్‌ వాసులు హలీంను కడుపునిండా తిన్నది లేదు.

 

ముస్లింల పవిత్రమైన రంజాన్‌ మాసం వస్తే చాలు ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌కు మంచి గిరాకీ  ఉంటుంది. రంజాన్‌ మాసంలో విశిష్టమైన ఆహారంగా హలీమ్‌ నిలుస్తుంది. ఒకప్పుడు ఈ హలీమ్‌ను రంజాన్‌ మాసంలో ముస్లింలే స్వీకరించేవారు.. ఇప్పుడు కులమతాలకు అతీతంగా అందరూ హలీమ్‌ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందునా హైదరాబాద్‌ హలీమ్‌ అంటే పడిచచ్చేవాళ్లు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. రంజాన్‌ మాసంలో  ప్రతీ వీధికో హాలీమ్ దుకాణం దర్శమనిచ్చేది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా చార్మినార్, ఓల్డ్ సిటీ, మలక్ పేట, కుల్సుమ్ పుర, బహదూర్ పుర ఇలా అనేక ప్రాంతాల్లో హాలీమ్ అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు. హైద్రాబాద్‌ పిస్తా హౌస్‌ పేరుతో రాష్ట్రంలో అనేక చోట్ల హలీమ్‌ సెంటర్లు ఉన్నాయి.  అన్ని వర్గాల వారు హాలీమ్ ను ఇష్టపడటంతో చాలాచోట్ల హలీమ్‌ తయారీ శాలలు పెరిగాయి. పగలంతా ఉపవాసాలు ఉండే ముస్లింలు దీక్షను విరమించాక తక్షణం శక్తి కోసం హలీమ్‌ స్వీకరిస్తారు. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రంజాన్‌ మాసంలో దొరికే హలీమ్‌కు గులామ్‌లు అవుతారు.

 

మరో నెల రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది అనగా మహమ్మారి రూపంలో కరోనా దేశంలోకి ప్రవేశించింది. అంతే ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. హలీం ప్రియుల ఆశలపై వైరస్‌ నీళ్లు చల్లేసింది. హాలీమ్ తయారీని వ్యాపారులు ఆపేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్స్ అన్ని మూతపడ్డాయి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోవడంతో హాలీమ్ తయారీ కూడా కష్టమైంది. ఒక్క హలీమే కాదు  రంజాన్‌ స్పెషల్‌ వంటకాలైన భేజా ఫ్రై, సెహ్రాతో పాటు చాలా రకాల వంటకాలు కోవిడ్‌ దెబ్బకు ఉడకలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: