దిన పత్రికకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. అది కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అందులోనూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలైతే ఇక చెప్పే పని లేదు. అందులోనూ పత్రికలకు హెడ్డింగ్‌లు చాలా ప్రధానం. ఈ హెడ్డింగుల కోసం చాలా కసరత్తు జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ మొదటిసారి 1983లో గెలిచినప్పుడు ఈనాడు పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా.. "తెలుగుదేశం సూపర్ హిట్." ఈ హెడ్డింగ్ వెనుక ఉన్న కథను.. ఆ హెడ్డింగ్ పెట్టిన సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాశ్ గారు తాజాగా స్మరించుకున్నారు.

 

ఆ కథేంటో ఆయన మాటల్లోనే ..

1983 జనవరి 9ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీకి 202 సీట్లు వచ్చాయి. అయితే, పోలింగ్ జరగడానికి ముందే పతంజలికి, రామోజీరావు ఆఫీసు నుంచి ఒక మెసేజ్ వచ్చింది. విజయవాడ, హైద్రాబాద్, తిరుపతి ‘ఈనాడు’ ఎడిషన్లలోని సీనియర్స్ అందరూ ఒక్కొక్కరూ రెండేసి హెడ్డింగులు పెట్టాలి (తెలుగుదేశం గెలుపుపై). నన్ను పిలిచి రెండు హెడ్డింగులు పెట్టండి అన్నారు పతంజలి.

1. ఎదురులేని జెండా ఎగరేసిన ఎన్టీయార్.

2. ‘తెలుగుదేశం’ సూపర్ హిట్

అని కాగితమ్మీద రాసిచ్చాను.

IHG

 

ఆయన మొహం అదోలా పెట్టాడు. నచ్చలేదన్న మాట. అలా అన్ని ఎడిషన్ల నుంచీ పోలింగ్ కు ముందే 30 లేదా 40 హెడ్డింగులు సేకరించారు. రామోజీరావు సన్నిహితులతో కూర్చుని మాట్లాడి ‘తెలుగుదేశం’ సూపర్ హిట్ అనే శీర్షికను సెలక్ట్ చేశారు. టీడీపీని సినిమా పార్టీ అనీ ప్రతిపక్షాలు వెక్కిరించాయి. గనక, ఆ సినిమాయే సూపర్ హిట్టయ్యిందన్న చమత్కారం రామోజీరావుకి తెగ నచ్చింది. ఒక పక్క ‘ఈనాడు’ సర్క్యులేషన్ దుమ్మురేపుతున్నది. తెలుగుదేశం సూపర్ హిట్ అక్షరాల్ని ప్రత్యేకంగా ఆర్టిస్టుతో రాయించి అన్ని ‘ఈనాడు’ కేంద్రాలకూ పంపించారు.

 

కౌంటింగ్ కు రెండు రోజుల ముందే అందాయవి. గెలవగానే అందరం ఈ హెడ్డింగ్ వాడాము. హెడ్డింగ్ ఎవరు పెట్టారని అడుగుతూ పతంజలిగారికి ముందే మెస్సేజ్ వచ్చింది. నా పేరు పంపించారు. కంగ్రాచ్యులేట్ చేస్తూ రామోజీరావు నాకో పర్సనల్ మెస్సేజ్ పంపారు.. అంటూ గుర్తు చేసుకున్నారు తాడి ప్రకాశ్ గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: