ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం ఆదివారంతో ముగిసింది. దీంతో ఉపవాస దీక్షలు సైతం ముగించి సోమవారం ఈద్ ఉల్‌ ఫిత్ర్‌‌ పండుగను జరుపుకుంటున్నారు. రంజాన్‌ మాసాంతం చేసిన ఉపవాసాలు పరిసమాప్తం చేసిన సందర్భంగా పేదలకు తప్పనిసరిగా చేసే దానాన్ని ఫిత్ర్‌ అంటారు. దీంతోనే రంజాన్‌ పండుగకు ‘ఈదుల్‌ ఫిత్‌' అని పేరు వచ్చిందని పెద్ద‌లు చెబుతుంటారు. నెలంతా మంచి పనులు, ఉపవా దీక్షలు పూర్తి చేయడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు రకాల ఈద్‌ నమాజ్‌ చేస్తారు. పండుగ రోజున వేకువ జామునే ఫజర్‌ నమాజ్ చేశారు. రంజాన్‌ రోజున ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకం షీర్‌ఖుర్మా(సేమియాలు)ను తయారు చేస్తారు.

 

నూతన వస్ర్తాలు ధరించి అత్తరు అద్దుకొని, షీర్‌ఖుర్మాను ఆరగించిన అనంతరం పండుగ ప్రత్యేక నమాజ్‌కు  ముస్లింలంతా సామూహికంగా వెళ్తారు. కానీ కరోనా వైరస్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌‌ కారణంగా ఈ సంవత్సరం పండుగ వేడుకలను ఇండ్లల్లోనే నిర్వహించుకుంటున్నారు. సామూహిక ప్రార్థ‌న‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. అయితే ప్రతి సంవత్సరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈ సారి భౌతిక దూరం పాటిస్తున్న నేపథ్యంలో ముస్లింలు పండుగ వాట్సప్‌, మెసేజ్‌, వీడియో కాల్స్‌ ద్వారా శుభాకాంక్షలను తెలుపుకుంటున్నారు.

 

పండుగ శుభ సందర్భంలో పేదలు సైతం ఆనందంగా గడపడానికి ప్రతీ ముస్లిం ఫిత్ర్‌ తప్పక ఇవ్వాలి. ఫిత్రా అంటే స్థానిక కొలమానం ప్రకారం గోధుమలు, ఖర్జూరాలు లేదా అంతే విలువను పేదలకు దానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఒక ఫిత్ర్‌ను రూ.70గా నిర్ణయించారు. ఈద్‌ నమాజ్‌కు వెళ్లే ముందే దీనిని పేదలకు అందించాలి. అదేవిధంగా ఇస్లాం సౌధానికుండే ఐదు మూలస్తంభాల్లో ‘జకాత్‌' ఒకటి. ధనికులు ఏడాదికోసారి తమ సంపదలో రెండున్నర శా తం పేదలకు దానం చేయడాన్ని జకాత్ పిలుస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: