తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కార‌ణంగా రోజువారీగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఐదారురోజుల క్రితం వ‌ర‌కు అంతా స‌వ్యంగానే ఉంద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కరోనా బారిన‌ప‌డి ఆదివారం మరో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 53కి చేరుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,854కి చేరింది.

 

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 11 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఆరుగురు ఉన్నారని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తాజాగా 24 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,092 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 709 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. జగిత్యాలకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోగా.. హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి శ్వాసకోశ వైఫల్యం, కరోనాతో మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన 48 ఏళ్ల మహిళ కరోనాతోపాటు ల్యుకేమియాతో బాధపడుతూ చనిపోయారు.

 

హైదరాబాద్‌కే చెందిన మరో 72 ఏళ్ల మహిళ కరోనాకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌ కార్వాన్‌లోని బంజావాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బంజావాడిలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఈ నెల 19న కరోనా రాగా, అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబానికి చెందిన 8 మందిని క్వారంటైన్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా.. ఆదివారం ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ వాసులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: