మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన రద్దైంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అధికారులు విశాఖ, విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించారు. తక్కువ సంఖ్యలో ప్యాసింజర్లు ఉండటం, ఇతర కారణాల వల్ల అధికారులు విమానాలను రద్దు చేసినట్టు సమాచారం. నిన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చారు. 
 
విమాన శాఖ అధికారులు అర్ధరాత్రి విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో చంద్రబాబు విశాఖ పర్యటన పోస్ట్ పోన్ అయింది. దీంతో చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా అమరావతికి చేరుకుంటున్నట్టు ప్రకటించారు. అమరావతి నుంచి చంద్రబాబు ఈ నెల 27, 28 తేదీలలో జరిగే మహానాడు కార్యక్రమానికి హాజరు కానున్నారు. జూమ్ యాప్ ద్వారా 14,000 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. 
 
అయితే విశాఖకు విమాన సర్వీసులు రద్దు చేయడం గురించి టీడీపీ తీవ్రంగా స్పందించింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ చంద్రబాబు పర్యటనకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి విమాన సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ కుట్ర అని అన్నారు. వైసీపీ కుట్రలో భాగంగానే ఈ ఒక్కరోజు విమాన సర్వీసులను నిలిపివేసిందని ఆరోపణలు చేశారు. రేపటినుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పడం ఆరోపణలకు బలం చేకూరుస్తోందని వ్యాఖ్యలు చేశారు. 

 
చంద్రబాబు షెడ్యూల్ ను ప్రకటించిన తరువాతే ప్రభుత్వం విమాన సర్వీసులను బంద్ చేస్తున్నట్టు ప్రకటించిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి చేసిన ట్వీట్ దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకే సర్వీసులు రద్దు చేశామని మంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారని తెలిపారు. అయితే టీడీపీ ఆరోపణలపై వైసీపీ స్పందించాల్సి ఉంది. వైసీపీ స్పందిస్తే మాత్రమే ఈ ఆరోపణలలో అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: