నిరర్ధకంగా పడి ఉన్న స్థిరాస్తులను అమ్మేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం ఇప్పుడు ఏపీలో రాజకీయ తుపానుకు దారి తీస్తోంది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే జగన్ సర్కారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమిళనాడులోనే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఆస్తులు అమ్మే ఆలోచనలో ఉందని ప్రముఖ దిన పత్రిక రాసింది.

 

 

ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది. టీటీడీ ఇప్పటి వరకు విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా ఉందట. వాస్తవానికి టీటీడీ బడ్జెట్‌లో నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పొందుపర్చిందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ అంచనాలను బట్టి ఇప్పటికే గుర్తించిన భూములే కాకుండా దేశవ్యాప్తంగా దాతలు తిరుమల వెంకన్న స్వామికి ఇచ్చిన ఆస్తులను భవిష్యత్తులో అమ్మేందుకు ప్లాన్ చేస్తోందని ఆ పత్రిక తెలిపింది.

 

 

తమిళనాడులో వేలానికి సిద్ధం చేసిన 23 ఆస్తులే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు లిస్టు రెడీగా ఉందట. గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములే కాకుండా నగర పరిధిలోని విలువైన స్థలాలు వేలం వేసేందుకు రెడీ అవుతోందట టీటీడీ. ఈ జాబితాలో గుంటూరులోని కొత్తరాముల వీధి గుడిలో ఉన్న 2487 చదరపు అడుగుల భవనం కూడా ఉందట. దీన్ని అమ్మేందుకు ధర్మకర్తల మండలి ఫిబ్రవరిలోనే తీర్మానించిందట.

 

 

దీనితో పాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అంబర్‌పేట కలాన్‌ ప్రాంతంలోని 1800 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని కూడా అమ్మే ఆలోచనలో ఉందట. మల్కాజిగిరి మండలం యాదవ్‌నగర్‌ పరిధిలోని 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంటు ఫ్లాట్‌ను కూడా అమ్మబోతోందట. ఇవే కాదు.. ఇంకా.. నాందేడ్‌, బెంగళూరు నగరాల్లోనూ కొన్ని ఆస్తులు కూడా అమ్మకానికి రెడీగా ఉన్నాయట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: