ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.  రోజూ  6 వేలకు పైగా కొత్త కేసులొచ్చేస్తున్నాయి. తాజాగా మరో 6 వేల 767 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య  లక్షా 32 వేలకు చేరువైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్ధితి మరింత డేంజర్ గా తయారైంది. అక్కడ 50 వేల మార్క్ కు చేరువైంది.

 

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది.  తొలివిడత లాక్‌డౌన్ వేళ కరోనా వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉండగా, నాలుగో విడత లాక్‌డౌన్ సడలింపులు అమలవుతున్న ప్రస్తుత సమయంలో వైరస్ వ్యాప్తి చేయిదాటిపోయింది. గడచిన మూడు రోజులుగా పరిస్థితి పూర్తిగా దిగజారింది. కేవలం 72 గంటల్లో దేశంలో 20వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 20వేల కేసులు నమోదు కావడానికి 90 రోజుల సమయం పడితే...ఇప్పుడు కేవలం మూడంటే మూడు రోజుల్లో అంతే సంఖ్యలో కొత్త కేసులు లెక్కతేలాయి. దేశవ్యాప్తంగా లక్షా 32 వేలకు పైగా కేసులు నమోదు కాగా.,   మహమ్మారి బారిన పడి 3 వేల 800 మందికి పైగా  మృతి చెందారు.  ప్రస్తుతం ఇండియాలో ఇండియాలో యాక్టివ్ కేసులు సుమారు 74 వేలు ఉండగా., 55 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

దేశవ్యాప్తంగా చూసుకుంటే.. మహారాష్ట్రలో కరోనా ఊహకందని రీతిలో విజృంభిస్తోంది. అక్కడ ఒక్క రోజే... 2 వేల 608 కేసులొచ్చాయి. ఒకప్పుడు ఇండియా మొత్తంలో కూడా అన్ని కేసులు వచ్చేవి కావు. ప్రస్తుతం మహరాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య  50వేలకు చేరువైంది.

 

మహారాష్ట్రతోపాటూ... తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుదవుతున్నాయి. తమిళనాడులో కొత్తగా  765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 10 వేల 567 మందికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16 వేలు దాటింది. గత 24 గంటల్లో మృతి చెందిన ఎనిమిది మందితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 111గా ఉంది.

 

కర్ణాటకలో గత 24 గంటల్లో 130 కరోనా కేసులు గుర్తించారు.  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 వేలు దాటింది.  ఇందులో  దాదాపు 14 వందలు యాక్టివ్‌ కేసులు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 42 మంది చనిపోయారు. ఇక మధ్యప్రదేశ్‌లో   కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 వేల 665కు పెరిగింది.

 

గుజరాత్‌లో  కొత్తగా 394 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క అహ్మదాబాద్‌ నగరం నుంచే 279 కేసులు వచ్చాయి. ఇవాళ ఒక్కరోజే 29 మంది మరణించగా.. ఒక్క మరణం మినహా మిగిలినవన్నీ అహ్మదాబాద్‌లోనే సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14 వేలు దాటింది. కరోనా కట్టడి కోసం ఢిల్లీలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య  87కు పెంచారు.  దేశ రాజధానిలో కొత్తగా 508  కేసులు గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య పదమూడున్నర వేలకు చేరువైంది.

 

మరోవైపు భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతమయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో అభివృద్ధి చేస్తున్న 14 కరోనా వ్యాక్సిన్లలో 4 టీకాలు అతి త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకుంటాయని వివరించింది.  ఐదు నెలల్లో భారత్‌లో నాలుగు కరోనా వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.  వ్యాక్సిన్ వచ్చినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో ఏడాది పడుతుందని ...అందువల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: