మద్య నిషేధం. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఇది ఒకటి. దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు విడతలుగా 33 శాతం షాపులను తగ్గించారు. అలాగే బార్లను కూడా కట్టడి చేస్తున్నారు. 

 

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో చేసిన మరో హామీ దశలవారీ మద్య నిషేధం. ఆదాయం కోసం టీడీపీ మద్యాన్ని విపరీతంగా ప్రోత్సహించిందని... ఆపార్టీ నేతలు మాఫియాగా మారిపోయారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే స్టెప్‌ బై స్టెప్‌ లిక్కర్‌ బ్యాన్‌ ఉంటుందని చెప్పారు. 

 

ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది  సెప్టెంబర్  నుంచి కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి వచ్చింది. షాపులను విడతల వారీగా తగ్గించాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. మాఫియాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వమే బ్రూవరీస్ కార్పోరేషన్ ద్వారా షాపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌, వాచ్‌మెన్లను నియమించింది. అలాగే సమయాన్ని కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కుదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటు పర్మిట్‌ రూములకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో గొడవలు బాగా తగ్గాయి. 

 

ఇక కొత్త పాలసీ ప్రకారం అప్పటి వరకు ఏపీలో ఉన్న మద్యం దుకాణాలు 20 శాతం  తగ్గాయి. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం మరో 13 శాతం షాపులను తగ్గించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు 2 వేల 934 మాత్రమే ఉన్నాయి. ఇటు ధరలు కూడా 75 శాతం పెంచేసింది ప్రభుత్వం. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గి. పక్కరాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ ఎక్కువగా జరుగుతుందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సీఎం మాత్రం వెనక్కి తగ్గలేదు. లిక్కర్‌ వినియోగం తగ్గించాలని... దీనికి లాక్‌డౌన్‌ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం అవుతోంది. 

 

ముఖ్యమంత్రి భావించినట్టుగానే ఏపీలో మద్యం వినియోగం భారీగా తగ్గిందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. గతంతో పోల్చి లిక్కర్‌లో 34, బీర్లలో 50 శాతం అమ్మకాలు తగ్గినట్టు చెబుతున్నారు. ఇటు కుటుంబాలు కూడా బాగుపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

ఇక ఇదే సమయంలో మద్యం అక్రమ రవాణా కట్టడి చేసే విషయంలోనూ నడుం బిగించింది జగన్ సర్కార్. గ్రామ, వార్డు,  సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. దీంతో ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇలా దశలవారీగా మందును ఏపీ పొలిమేరలు దాటేలా తరిమి కొడతామని చెబుతోంది ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: