దేశంలో ఓ వైపు కరోనా వైరస్ ప్రభావంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.. మరోవైపు భానుడి ప్రతాపానికి వేడి గాలులతో ఇంట్లో ఉండలేని పరిస్థితి ఇలా సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు.  ఓ వైపు పక్కరాష్ట్రాల్లో తుఫాన్ తో బీభత్సాలు జరుగుతున్నాయి.. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మనుషులను పిండేస్తున్నాయి.  తెలంగాణపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు తట్టుకోలేక ప్రజలు ఠారెత్తిపోతున్నారు. లాక్‌డౌన్ సడలింపులు ఉన్నా సూరీడి ఉగ్రరూపానికి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. ఓవైపు ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాల్పులు మరింత భయం పుట్టిస్తున్నాయి.  సూరీడి ఉగ్ర రూపానికి జనం విలవిలలాడిపోతున్నారు. 

 

అసలు బయట కాలు పెడదామంటే గుండ ఝల్లుమంటుంది... పోనీ ఇంట్లో కూర్చుందామంటే వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్దులు, చిన్న పిల్లల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.  ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో నిన్న ఏకంగా 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే వడగాల్పులు తప్పవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

 

రామగుండం, కొత్తగూడెం పట్టణాల్లో  కొత్తగా చెప్పనక్కరలేదు.. ఎండ అంతా ఇక్కడే నుంచి వస్తుందా అన్నట్టుంది.  గడచిన రెండు, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతంగా ఎండలు మండనున్నాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.  అత్యధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు. చెట్లు కొట్టివేత, అడవుల నరికివేత వంటివి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో నిన్న 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తున్నా హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు మాత్రం నిర్ధారించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: