లాక్ డౌన్ నేపథ్యంలో రెండు నెలలకు పైనే హైదరబాద్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు అమరావతి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ డీజీపీ పర్మిషన్ ఇవ్వడంతో చంద్రబాబు, తన తనయుడు లోకేశ్‌తో కలిసి అమరావతిలోని తన నివాసానికి వచ్చారు. అయితే చంద్రబాబు హైదరబాద్ నుంచి రోడ్డు మార్గంలో రావడంతో, పలు చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

 

అటు చంద్రబాబు ఏపీకి రావడంతో సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు తెగ హడావిడి చేశారు. తమ నాయకుడుని ఎవరు ఆపలేరని, అమరావతిలో పులి దిగిందని ఓ పోస్టులు పెట్టారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. చంద్రబాబు ఏపీకి వచ్చారు. టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. అయితే కరోనా ప్రభావం ఉన్నాసరే టీడీపీ కార్యకర్తలు ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. ఎక్కడికక్కడే బాబు దగ్గరకు ఎగబడిపోయారు.

 

పైగా మాస్కులు కూడా పెట్టుకోలేదు. దీనికి తోడు చంద్రబాబు కూడా, తమ కార్యకర్తలకు జాగ్రత్తలు చెప్పే కార్యక్రమం కూడా చేయలేదు. సరే ఇదంతా అభిమానం జరిగింది అనుకుంటే...గత రెండు నెలలుగా బాబు నీతి వాక్యాలు చెప్పి, ఇప్పుడు ఇలా చేయడాన్ని ఏమంటారో ఆయన విజ్ఞతకే వదిలేయలి. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై బాబు, మిగతా టీడీపీ నేతలు తెగ విమర్శలు చేశారు.

 

అసలు వైసీపీ నేతలు సామాజిక దూరం పాటించడం లేదని, కరోనా వ్యాప్తికి కారణం వాళ్లే అంటూ మాట్లాడారు. కానీ ఇప్పుడు నిబంధనలు ఏమి పట్టించుకోకుండా అమరావతికి వచ్చేశారు. అంటే అప్పుడు పూర్తిగా రాజకీయం చేయాలనే బాబు అలా విమర్శలు చేసినట్లు అర్ధమైపోతుంది. ఇక ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలని వారు అడుగుతున్నారు. ఏదేమైనా చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుందిలే. 

మరింత సమాచారం తెలుసుకోండి: