కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరబాద్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాదాపు 2 నెలలకు పైనే అక్కడే ఉండి, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పార్టీని నడిపించారు. మీడియా సమావేశాలు, లేఖలు రాసి జగన్ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తూనే విమర్శలు చేశారు. అయితే లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బాబు కరోనాకు భయపడి హైదరబాద్‌లో దాక్కున్నారని వైసీపీ నేతలు విమర్శించారు.

 

అయితే లాక్ డౌన్ నిబంధనల మేరకే హైదరబాద్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్పారు. ఇలా విమర్శలు, ప్రతివిమర్శలతో రెండు నెలలు గడిచాక చంద్రబాబు ఏపీకి వచ్చారు. ఏపీ డీజీపీ పర్మిషన్ ఇవ్వడంతో ఆయన అమరావతిలోనే తన నివాసానికి చేరుకున్నారు. ఇక బాబు అమరావతికి రావడంతో తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు బాబుపై విమర్శలు చేస్తున్నారు.

 

కరోనా సోకుతుందనే భయంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు ఇప్పడు ప్రజల వద్దకు వచ్చారని మంత్రులు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో బాబు మళ్లీ ఏపీ బాట పట్టారని, ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాట్లాడారు. అలాగే విశాఖ ఘటన ఎప్పుడో జరిగితే ఇప్పుడు బాధితులని పరామర్శించి ఏం చేస్తారని అడుగుతున్నారు.

 

అయితే మంత్రులు ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. అప్పుడు అలాగే కరోనాకు భయపడి హైదరబాద్‌లో దాక్కున్నారని అన్నారని, అంటే తెలంగాణలో కరోనా లేదా? అని వీరికి తెలియదా అని అడిగారు. ఇక ఇప్పుడు కూడా కరోనా ప్రభావం తగ్గడంతోనే బాబు మళ్ళీ ఏపీ బాట పట్టారని మాట్లాడుతున్నారని? అసలు ఏపీలో కరోనా తగ్గుతుందో? పెరుగుతుందో తెలియడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం లేదా? అని అడుగుతున్నారు. ఏదో విమర్శలు చేయాలి కాబట్టి మంత్రులు బాబుని టార్గెట్ చేసుకుని, లాజిక్ లేని విమర్శలు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: