నందిగం సురేష్....అతి తక్కువ కాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు. వైసీపీ దళిత నాయకుల్లో ముఖ్యుడైన సురేష్, జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. పైగా అమరావతి ప్రాంతంలో కీలక నాయకుడు. 2019 ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీన ఆయన్ని స్పెషల్‌గా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

సురేష్ అనుచరులు ఇసుక దోపిడి చేస్తున్నారని, ఇంకా పలు అక్రమాలకు పాల్పడుతున్నారని మొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు. అలాగే అమరావతి ఉద్యమ సమయంలో ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టారు. తాజాగా కూడా రాజధాని ప్రాంతంలో సురేష్‌తో పాటు ఆయన అనుచరులు భూములు కబ్జా చేశారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ చేసే ఆరోపణలపై సురేష్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

 

రాజధానిలో తానూ తన అనుచరులు భూమిని కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఎప్పుడూ అబద్ధాలతో బతికే  చంద్రబాబుకు నిజ నిర్ధారణ కమిటీ వేసి అర్హత లేదని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సింది చంద్రబాబు గత ఐదేళ్ల పాలనపైన అని మాట్లాడారు. అలాగే లోకేశ్, ఆయన అనుచరులు అమరావతిలో చేసిన దోపిడిపై కమిటీ వేయాలని, అప్పుడు నిజాలు బయటపడతాయని అన్నారు. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ నేతలు పంట పొలాలు తగలబెట్టి తనపై అనేక తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు.

 

ఇక అప్పుడే ఆ కేసులో వైఎస్‌ జగన్‌ పేరు చెప్పమని పోలీసులు తలమీద తుపాకీ పెట్టినప్పుడే  భయపడలేదని, ఇప్పుడు చంద్రబాబుకు తాను ఎందుకు బయపడతానని చెప్పారు. అయితే పదే పదే టీడీపీ, సురేష్‌ని టార్గెట్ చేయడానికి కారణం ఇదే అని అర్ధమవుతుంది. పైగా సురేష్ అమరావతి ప్రాంతంలో పెద్ద నాయకుడుగా ఎదిగే అవకాశముందని టీడీపీ ఆయన్ని ఇబ్బంది పెట్టి తోక్కేయడానికి చూస్తున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తానికైతే టీడీపీ మాత్రం సురేష్‌ని గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: