భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన  24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అత్యధికంగా కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌టెన్‌లోకి వెళ్లింది. 

 

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,38,845కి చేరింది. ఒక్కరోజే 154మంది మృత్యువాతపడటంతో.. మొత్తం మృతుల సంఖ్య 4 వేల 21కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ  సంక్షేమశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు 57 వేల 721మంది కోలుకోగా మరో 77 వేల 103మంది చికిత్స పొందుతున్నారని  తెలిపింది. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా దాదాపు 70వేల పాజిటివ్‌ కేసులు ఉండగా నేటికి ఆ సంఖ్య లక్షా 38వేలకు చేరింది. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు  దాదాపు 12 నుంచి 13 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నట్లు స్పష్టమవుతోంది. 

 

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. దేశంలోనే అత్యధిక తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఒక్కరోజే మహారాష్ట్రలో 3 వేల 41పాజిటివ్‌ కేసులు,  58మరణాలు సంభవించాయి.  మొత్తం  కేసుల సంఖ్య 50 వేల 231కి.. మృతుల సంఖ్య 1635కి చేరింది. మహమ్మారిని  ఎదుర్కోవడంలో భాగంగా రాష్ట్రంలో కొవిడ్‌-19 చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యుల అవసరం ఎక్కువైంది. ఈ సమయంలో మహారాష్ట్రకు ప్రత్యేక బృందాలను  పంపించేందుకు సిద్ధమని కేరళ ప్రకటించింది. దీనికి అంగీకరించిన మహారాష్ట్ర ప్రభుత్వం 50మంది వైద్యులతో పాటు మరో 100మంది నర్సులను కేరళ నుంచి  రాష్ట్రానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇక కొవిడ్‌-19 తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తరువాత తమిళనాడు ద్వితీయ స్థానంలో  కొనసాగుతోంది. ఒక్కరోజే 765పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో కేసుల సంఖ్య 16 వేల 277కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 111మంది  మృత్యువాతపడ్డారు.

 

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్‌ మూడో స్థానంలో ఉంది. కరోనా మరణాల సంఖ్యలో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో  కొనసాగుతోంది. ఇప్పటివరకు గుజరాత్ లో 14 వేల 56పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 858 మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మొత్తం కేసుల సంఖ్య  13 వేల 418కి చేరగా వీరిలో ఇప్పటి వరకు 261మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింత తీవ్రం కానుంది. జూన్‌లో పరిస్థితి దారుణంగా ఉండనుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా  కేసుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కానీ, ఆర్థికపరమైన ఆందోళనలు దశలవారీ సడలింపులకు కారణమయ్యాయి. సడలింపులతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: