ఆయన వైసీపీ ఎంపీ.. మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరి టికెట్ సంపాదించి ఎంపీ అయ్యారు. కానీ ఈయన పేరుకే వైసీపీ ఎంపీ.. ఆయన అన్ని విషయాల్లోనూ బీజేపీకే అనుకూలంగా ఉంటారన్న వాదన ఉంది. తాజాగా ఆయన సొంత పార్టీని ఇబ్బంది పెట్టే రీతిలో మీడియాకు ఎక్కడం సంచలనం సృష్టిస్తోంది. ఆయనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుపతి వెంకన్న భూముల అమ్మకం విషయంలో ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టిస్తోంది.

 

 

టీటీడీ భూముల అమ్మకం విషయంపై ఆయన తెలుగు దేశం అనుకూల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సొంత పార్టీ తీరునే తీవ్రంగా తప్పుబట్టారు. భూముల అమ్మకం విషయం ముమ్మాటికీ తప్పేనంటూ కుండబద్దలు కొట్టారు. అంతే కాదు..అది ఏకంగా దైవ ద్రోహం కింద వస్తుందంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఈ విషయంలో ఆయన అభిప్రాయాన్ని గౌరవించొచ్చు. కానీ ఆయన మాట్లాడిన వేదిక చూస్తే.. ఆయన వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేనట్టుగా కనిపించింది.

 

గతంలో కూడా ఈయన కొంత తేడాతో ఉన్నారని ప్రచారం జరిగింది. టిటిడి భూముల విషయంలో ఆయనకు ఏదైనా అభ్యంతరం ఉంటే.. ముందుగా టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డితో మాట్లాడి ఉండాల్సింది. లేదా.. దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేయాల్సింది. అంతగా కాదంటే.. ముఖ్యమంత్రితోనైనా చర్చించవచ్చు. కానీ అలాంటి పనులు చేయకుండా మీడియాకు ఎక్కిన తీరు చూస్తే పార్టీ పట్ల క్రమశిక్షణారాహిత్యమే కనపించింది.

 

నిరర్ధక ఆస్తుల పేరుతో భూముల వేలం వేయాలని టిటిడి నిర్ణయం భక్తుల మనోభావాలను దెబ్బతీయమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని అనుకోవడం సరికాదని చెప్పారు. ఆస్తుల అమ్మకం భగవంతుడికి టిటిడి చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు. దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘురామకృష్ణంరాజు అన్నారు. మరి జగన్ ఈయన్ను ఇలాగే వదిలేస్తారా.. ఏదైనా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: