తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొందరు వడదెబ్బ భారీన పడి మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. మండుటెండల్లో తిరిగే వారిలో 30 శాతం మందిలో ప్రాణాపాయ ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎండలో తిరిగితే శరీరంలోని నీరు హరించుకుపోవడంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. కొన్ని సందర్భాల్లో మెదడులోని రక్త నాళాలు చిట్లిపోయి ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. 
 
సిగరెట్ తాగేవారు డీ హైడ్రేషన్ భారీన పడితే మరింత ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు అటూఇటుగా నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 
 
ఎండలో ఎక్కువ సమయం తిరిగితే శరీరంలోని ఖనిజాలు, నీరు, లవణాలు బయటకు పోతాయి. శరీరం శక్తిని కోల్పోతుంది. ఈ సమయంలో శరీరంలో నీరు, లవణాల భర్తీ జరగకపోతే శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంది. శరీరంలో వేడి అంతకంతకూ పెరిగిపోయి వడదెబ్బ భారీన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. డీహైడ్రేషన్ కు గురైతే రక్తం చిక్కబడి రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయి. 
 
రక్తం గడ్డ కడితే సిరల గోడలు చిట్లిపోయి మెదడులో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, తిమ్మిర్లు, చూపు మందగించడం వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. తగినంత నీరు తాగడం, టోపీ ధరించడం, నీరసంగా ఉంటే ఓ.ఆర్.ఎస్. ద్రావణం తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సిగరెట్ తాగే వారు, పక్షవాతం బాధితులు, క్యాన్సర్ రోగులకు వడదెబ్బతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: