ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేశ్‌బాబు ప్రభుత్వ భూములను లాక్‌డౌన్‌ సమయంలో ఈ-వేలం ద్వారా విక్రయించడం తగదని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చేలా ఉండటం గమనార్హం. 
 
హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆస్తులను అమ్ముకోవటం భావ్యమా...? అని ప్రశ్నించింది. ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి కానీ ఆస్తులను ఆమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్న వేలం కోర్టు తీర్పు ప్రకారమే జరగాలని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం దివాళా తీసిందా...? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా..? అని ప్రశ్నించింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని... ఈ రాష్ట్రంలో ప్రజలు ధనవంతులు మాదిరిగా కనిపిస్తుంటే... ప్రభుత్వం పేదరికంగా ఉందని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతోందని ఇలాంటి సమయంలో వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బిల్డ్ ఏపీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలని భావించింది. అయితే బిల్డ్ ఏపీపై టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు చేశాయి. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర సురేష్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా కోర్టు ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఇప్పటికే పలు సందర్భల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. 28వ తేదీ విచారణలో కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: