తమిళనాడులో ఉన్న శ్రీవారి నిరర్థక ఆస్తుల అమ్మకాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సిద్ధమైన నేపథ్యంలో, టీటీడీ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. శ్రీవారి భూముల వేలంపై రాజకీయ పార్టీల నుంచే కాకుండా, హిందూ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే టీటీడీ భూములు వేలం వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక రోజు ఉపవాస దీక్ష చేసి, ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

 

తిరుమల శ్రీవారి భూములను ఇప్పుడే కాదు..భవిష్యత్తులోనూ అమ్మకూడదని డిమాండ్ చేశారు. శ్రీవారి స్థిరాస్థిలో గజం భూమి అమ్మిన ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే కన్నా ఇలా మాట్లాడటంతో ఆయన మాజీ సహచరులు అంటే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ సహచరులుగా ఉన్న విజయవాడ వైసీపీ నేతలు కన్నాపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ...ఓ కొత్త స్కామ్ గురించి చెప్పారు.

 

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు..కన్నా భూ కుంభకోణం చేశారని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా చేశారని, ఈ భూభాగోతాన్ని కొద్ది రోజుల్లోనే బయట పెడతామని వెల్లడించారు. టీటీడీ విషయంలో ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకుంటే బాగుంటుదని కన్నాకు హితవు పలికారు. అయితే కన్నా భూ కబ్జా చేసినట్లు వైసీపీ నేతలు దగ్గర ఆధారాలున్నాయా? లేవా అనేది అర్ధం కాకుండా ఉంది.

 

కన్నా పదే పదే విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు రివర్స్‌లో ఇలా వచ్చారేమో అని రాజకీయ విశ్లేషుకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కన్నా కబ్జా చేసినట్లు ఆధారాలు ఉండే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అయితే త్వరలో బయటపెడతాం అంటున్నారు కదా...అప్పుడు ఏమన్నా ఆధారాలు చూపిస్తారేమో వెయిట్ చేయాలని, లేదంటే రాజకీయంగానే విమర్శలు చేసినట్లు అర్ధమవుతుందని వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: