తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలి...ఇది జగన్ పెట్టుకున్న రూల్. దీంతో ఎన్నికల్లో ఘోరంగా ఓడి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన టీడీపీ ఎమ్మెల్యేలకు గోడ దూకే అవకాశం దక్కలేదు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...టీడీపీని వీడి, వైసీపీలో చేరకుండా జగన్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్థానం కావాలని అడిగారు. ఇక స్పీకర్ కూడా ఆయనకు ప్రత్యేక స్థానం కేటాయించారు.

 

ఆ విధంగా వంశీ పార్టీ మార్పు విషయంలో ట్రెండ్ సెట్ అయింది. ఇక దాన్ని అనుసరించి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు జగన్‌కు మద్ధతు తెలిపారు. అంటే వీరు టెక్నికల్‌గా పదవి పోకుండా ఉండటానికి వైసీపీలో చేరకుండా జగన్‌కు మద్ధతు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేల చేత జగన్‌కు జై కొట్టడానికి సిద్ధమవుతున్నారు.

 

ఇప్పటికే ప్రకాశం జిల్లాలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు...టీడీపీని వీడటం ఖాయమైపోయింది. అటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా పార్టీ వీడతారని వార్తలు వచ్చాయి గానీ...ఆయన ఆ వార్తలు ఖండించారు. అలా అని ఆయన పార్టీని వీడరని గ్యారెంటీ లేదు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీని వీడే అవకాశముందని అనుమానాలు వస్తున్నాయి.

 

అందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే స్వామిలు కూడా బాబుకు షాక్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అలాగే వెస్ట్ గోదావరి ఉండి ఎమ్మెల్యే కలవపూడి రాంబాబు, విశాఖ నగరంలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడొచ్చని తెలుస్తోంది. ఇక వీరు పార్టీని వీడితే బాబు ప్రతిపక్ష హోదా పోవడం ఖాయం.

 

టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 17 కంటే కిందకు వస్తే బాబు హోదా గల్లంతు అవుతుంది. ఇక ఏ హోదా లేకుండా చంద్రబాబు ఎప్పుడు లేరు. బాబు సీఎం అయిన దగ్గర నుంచి అంటే 1995 నుంచి చూసుకుంటే...ఆయన 14 ఏళ్ళు సీఎంగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఒక సంవత్సరం ఉన్నారు. కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువమంది జంప్ అయితే పాపం బాబు హోదా గల్లంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: