మహానాడు తెలుగుదేశం పార్టీ అత్యున్నత వేదిక. పార్టీలో అధ్యక్షుడు నుంచి సాధారణ కార్యకర్త వరకూ అంతా ఒక్క చోట చేరి గతాన్ని నెమరేసుకుంటారు. వర్తమానాన్ని సమీక్షిస్తారు. భవిష్యత్తుకు బాటకు వేసుకుంటారు. ఓ విధంగా మహానాడు టీడీపీ దశ, దిశ మార్చే వేడుక అని చెప్పకతప్పదు.

 

తెలుగుదేశం వయసు ఇప్పటికి 38 ఏళ్ళు. దాదాపు సగం కాలం పైగా అధికారంలో ఉంది. ఎన్టీయార్ ఎనిమిదేళ్ళు ఉమ్మడి ఏపీని  పాలిస్తే, ఆయన తరువాత అల్లుడు చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీకి, విభజన ఏపీకి  పనిచేశారు. ఇక పార్టీ ప్రెసిడెంట్ గా అన్న గారు పద్నాలుగేళ్ళు ఉంటే చంద్రబాబు గత  పాతికేళ్ళుగా కొనసాగుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇన్నేళ్ళ పాటు బాబు  అధినేతగా ఉండడం కూడా ఒక రికార్డే.

 

ఈసారి మహానాడు అనేక క్ర్లిష్ట పరిస్థితుల మధ్య జరుగుతోంది. ప్రత్యక్షంగా నాయకులు, పార్టీ కార్యకర్తలు కలసుకోవడానికి వీలులేని పరిస్థితి. బయట కరోనా ఉంది. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో జామ్  యాప్ ద్వారానే రెండు రోజుల పాటు పార్టీ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 23 సీట్లతో ఘోర ఓటమితో చతికిలాడిన తరువాత టీడీపీ మళ్లీ ఇంతటి సభను జరుపుకోలేదు.

 

కాబట్టి మహానాడులో అన్ని విషయాలు చర్చకు వస్తాయని భావిస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు తన భావి వారసుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేస్తారని అంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అతన్ని ప్రతిపాదిస్తారని వినిపిస్తోంది. అలాగే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు నియామకం జరగవచ్చు. తెలుగు యువత పదవికి కూడా యువ నేతల నుంచి తీసుకుంటారని అంటున్నారు.

 

జగన్ పాలన ఏడాది గడచిన వేళ ఇప్పటి నుంచే పుంజుకుని దూకుడు ప్రదర్శించకపోతే టీడీపీకి ఫ్యూచర్ లో ఇబ్బందే. అందుకే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఈ మహానాడులో సిధ్ధం చేస్తారని వినిపిస్తోంది. చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: