విరసం నేత వరవరరావు ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నారన్న కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన్ను మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉంచారు. అయితే ఇప్పుడు ఆ జైలులో ఓ కరోనా మరణం సంభవించడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

 

ఆయన కుటుంబసభ్యుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ అయిన ఎన్. వేణుగోపాల్ తన ఫేస్ బుక్ వాల్ పై వరవరరావు ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. " మిత్రులారా, తలోజా జైలులో కొవిడ్ వల్ల ఒక మరణం సంభవించిందని ఇవాళ ది వైర్ లో ఒక వార్తాకథనం చూసినప్పటి నుంచి మాకు చాల ఆందోళనగా ఉంది. కొవిడ్ సందర్భంలో మహారాష్ట్ర జైళ్లలో పరిస్థితి గురించి పియుసిఎల్ వేసిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంలో నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానమిస్తూ, మహారాష్ట్ర జైళ్లలో (తలోజా, యరవాడ, ధులె) మూడు మరణాలు సంభవించాయని చెప్పింది.

 

 

వరవరరావు గారు ఉన్న జైలులో కూడ ఒక మరణం సంభవించింది గనుక మాకు ఆందోళనగా ఉంది. వరవరరావు గారి క్షేమ సమాచారం కోసం మా న్యాయవాది తలోజా జైలుకు ఫోన్ చేస్తే, ఎవరో ఫోన్ ఎత్తి, ప్రశ్న విని ఏమీ జవాబు చెప్పకుండా ఫోన్ పక్కనపెట్టి వెళ్ళిపోయారు. ఎవరినైనా సమాచారం అడగడానికి వెళ్లారో తెలియదు గాని ఎంతకూ తిరిగిరాలేదు. దీనితో మా ఆందోళన మరింత పెరిగింది.

 

 

తలోజా జైలులో గాని, మహారాష్ట్ర జైళ్ల శాఖలో గాని, ప్రభుత్వంలో గాని, మీడియాలో గాని మీకు ఎవరైనా తెలిసినవారుంటే దయచేసి ఏదైనా సమాచారం తెలుస్తుందేమో కనుక్కోవలసిందిగా ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. వరవరరావు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన కుమార్తెలు మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు కూడా రాశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: