తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూను పరిమిత ఆంక్షలతో మరికొన్ని రోజులు సడలించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. 
 
సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనుండటంతో కరోనా కేసుల వ్యాప్తి గురించి చర్చించడంతో పాటు తదుపరి కార్యాచరణ గురించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు తక్కువగానే ఉన్నా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 
 
గత 14 రోజులుగా కేసులు నమోదు కాని పలు జిల్లాల్లో నిన్న కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా నియంత్రణ కొరకు పలు కీలక చర్యలను కూడా ప్రకటించనుందని తెలుస్తోంది. రాష్టంలో ఇప్పటికే వ్యాపార, వాణిజ్య సేవలు ప్రారంభమయ్యాయి. గతంతో పోలిస్తే జన సంచారం భారీగా పెరిగింది. రాష్ట్రంలో జూన్ నెల నుంచి షూటింగులు ప్రారంభం కానున్నాయి. 
 
ఈరోజు జరగబోయే సమావేశంలో నియంత్రిత సాగు విధానం గురించి చర్చ జరగనుంది. ఇప్పటికే నియంత్రిత సాగుకు సంబంధించిన కార్యాచరణ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ లో దుకాణాలను రోజూ తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. హోటళ్లు, మాల్స్, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు ప్రభుత్వానికి  అభ్యర్థనలు వస్తున్నాయి. సిటీ బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు, పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: