ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు భారీ సంఖ్యలో కేసులు నమోదు కాని తూర్పు గోదావరి జిల్లాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ జిల్లాలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఒక వ్యక్తి నుంచి 77 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. జి.మామిడాడలో 56 మంది, బిక్కవోలు 13 మంది, రామచంద్రపురంలో ఏడుగురు, తునిలో ఒకరు మృతి చెందిన వ్యక్తి వల్ల కరోనా భారీన పడ్డారు. గురువారం రోజున జిల్లాలో ఒక వ్యక్తి కరోనా భారీన పడి మృతి చెందగా అప్పటినుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్నటివరకు జిల్లాలో 153 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఈరొజు జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జి.మామిడాడలో 56 కేసులు నమోదు కావడంతో ఆ ఊరి పేరు వింటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 16 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. చిన్న గ్రామంలో కేసుల తీవ్రత పెరుగుతుండడంతో వైద్యులు, అధికారులు ఆందోళన పడుతున్నారు. 
 
ప్రజలు అయిదు రోజులుగా ఇళ్లు దాటికి బయటకు రావడానికే జంకుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరస్ భారీన పడిన వారంతా సెకండరీ కాంటాక్టు వారే కావడం గమనార్హం. జిల్లాలోని బిక్కవోలులో ఐదేళ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. జనం తమ వీథుల్లోకి ఇతరులు రాకుండా దుంగలు అడ్డు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు 68 కరోన కేసులు నమోదు కాగా ఈరోజు నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 2787కు చేరింది. రాష్ట్రంలో 58 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: