తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1991కు చేరింది. గడచిన వారం రోజుల్లో రాష్ట్రంలో దాదాపు 400 మంది కరోనా భారీన పడగా 57 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. 
 
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ పొడిగింపు, లాక్ డౌన్ సడలింపు, కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు సూచనలు, నియంత్రిత సాగు, ఇతర విషయాల గురించి ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి భవన్ లో సమావేశం ప్రారంభమైంది. 
 
హైదరాబాద్‌లో మెట్రో రైలు, సిటీ బస్సు సర్వీసులకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే ఉద్దేశంలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రులు, అధికారుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మెట్రో రైలు, సిటీ బస్సు సర్వీసులకు అనుమతులు ఇస్తే ఒకటో తేదీ నుంచి బస్సు, రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 
 
లాక్ డౌన్ ప్రభావం వల్ల ప్రభుత్వం పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది మినహా ప్రభుత్వ ఉద్యోగుల్లో వేతనాలకు కోత విధించింది. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి జీతం ఇవ్వనున్నట్టు ప్రకటన చేయడంతో తెలంగాణ సర్కార్ కూడా పూర్తిస్థాయి జీతం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నియంత్రిత పంటలసాగు కోసం రైతులను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: