వైఎస్‌ జగన్ ఏడాది పాలనలో ఎక్కువ లబ్ధి ఎవరు పొందారంటే... వినిపించే సమాధానం అమ్మ. అవును ఏడాది పాలనలో తల్లులకే ఎక్కువగా ప్రయోజనాలు కల్పించారు జగన్‌. అమ్మ ఒడి నుంచి మొదలై... పిల్లల విద్యాభివృద్ధికి సంబంధించిన పలు పథకాల కింద నేరుగా తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేస్తోంది ప్రభుత్వం.

 

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన. ఇది జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తోన్న పథకం. అప్పటి వరకు ఉన్న విధానాన్ని సమూలంగా మార్చి... ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి సౌకర్యాలకు సంబంధించిన నిధులను నేరుగా తల్లుల ఖాతాలకే జమ చేస్తోంది సర్కార్. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా ఈ డబ్బులను వేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ప్రభుత్వం చెల్లించాల్సిన 18 వందల 80 కోట్ల  రూపాయల బకాయిలను కాలేజీలకు చెల్లించారు జగన్. తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ఫీజు రీయింబర్స్‌ పథకానికి కొత్త రూపు ఇచ్చి... కొత్త పుంతలు తొక్కించారు జగన్.

 

పెద్ద చదువులతోనే పేదరికం పోతుందని... అప్పుడే పేదల తలరాతలు మారుతాయని, బతుకులు బాగుపడతాయనే సదుద్దేశంతో అప్పట్లో వైఎస్‌ తెచ్చిన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తోంది జగన్ సర్కార్. దీనిలో భాగంగా ఫీజు రీయింబర్సుమెంట్ నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేయడం ద్వారా కార్పొరేట్ కాలేజీల ఆగడాలను ఆటకట్టించే ప్రయత్నం చేశారు జగన్. 

 

తల్లులే స్వయంగా తమ పిల్లలకు ఫీజులు కడతారు. అందువల్ల కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లులకు లభిస్తుంది. టీచింగ్‌ స్టాఫ్‌ సరిగా లేకపోయినా, వసతులు లేకున్నా ప్రశ్నించే వీలుంటుందన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రతి 3 నెలలకు ఒక సారి డబ్బులు కట్టడానికి వెళ్లడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు? సక్రమంగా కాలేజీకి వెళ్తున్నారా? లేదా? అని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. 

 

విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన పేరుతో మరో పథకాన్ని అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి ఐటీఐ విద్యార్థికి ఏడాదికి 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థికి 15 వేలు ఇస్తున్నారు. డిగ్రీ ఆపై కోర్సుల వారికి 20 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఇవి మొత్తాలు కూడా నేరుగా తల్లి అకౌంట్‌లోనే జమ చేస్తున్నారు. దీని వల్ల ఆయా కుటుంబాలు అప్పుల పాలు కాకుండా, తమ పిల్లలను గొప్పగా చదివించగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. 


  
కాలేజీల యాజమాన్యాలు ఫీజు విషయంలో ఏమైనా ఇబ్బందులు పెడితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది సర్కార్. కాలేజీల్లో సదుపాయాలు, మౌలిక వసతులు సరిగ్గా లేవని భావిస్తే 1902కు తల్లులు కాల్‌ చేయవచ్చు. ఉన్నత విద్యా శాఖలో ఈ కాల్‌ సెంటర్‌ ఉంటుంది. అంతే కాదు... ఈ కాల్‌ సెంటర్‌ను సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ఏ సమస్యలున్నా ప్రభుత్వం వెంటనే స్పందించేలా వ్యవస్థను తయారు చేసింది జగన్ ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: