దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రతిరోజూ 6000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం వరకు 1,51,767 కరోనా కేసులు నమోదు కాగా 4337 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 64,426 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
ఏపీలో ఈరోజు 68 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2787కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 71 కరోనా కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 1991కు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భారీన పడి 58 మంది మృతి చెందగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా భారీన పడి 57 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమానంగా జనాభా కలిగిన పలు రాష్ట్రాలు మాత్రం కరోనా కట్టడిలో సక్సెస్ అవుతున్నాయి. 
 
దేశంలో కేరళ, అస్సాం రాష్ట్రాలు సరైన ప్రణాళికలతో కరోనాను నియంత్రించడంలో కొంతమేర సక్సెస్ అవుతున్నాయి. కేరళ జనాభా 3 కోట్ల 48 లక్షలు కాగా ఇప్పటివరకు 795 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 52,878 కరోనా టెస్టులు చేశారు. అస్సాం జనాభా 3 కోట్ల 9 లక్షలు. అస్సాంలో ఇప్పటివరకు 352 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 52,862 కరోనా టెస్టులు చేశారు. 
 
ఈశాన్య రాష్ట్రం, బాగా వెనుకబడిన రాష్ట్రం, కేంద్రం నిధులతో నడిచేటటువంటి రాష్ట్రం అయిన అస్సాం కరోనాను కట్టడి చేయడంలో సఫలమవుతోంది. ఏపీ, తెలంగాణ జనాభాకు దాదాపు సమాన జనాభా కలిగిన కేరళ, అస్సాం రాష్ట్రాలు కరోనాను కట్టడి చేయడంలో సూపర్ సక్సెస్ అవుతూ ఉండటంతో సీఎం కేసీఆర్, సీఎం జగన్ ఆయా రాష్ట్రాలు అమలు చేసిన మోడల్ లను అనుసరిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనాను కట్టడి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: