టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని జగన్‌పై విమర్శలు చేయడానికి బాగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. జూమ్ యాప్‌లో టీడీపీ నేతలు దొరికిందో ఛాన్స్ అన్నట్లుగా జగన్‌పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసేస్తున్నారు. అసలు జగన్ పాలనలో ఏపీ ప్రజలు పరిస్తితి దారుణంగా ఉందనే కలరింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మహానాడు వేదికగా మాచర్ల ఘటనని మళ్ళీ లేపి, జగన్‌పై విమర్శలు చేశారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలు మాచర్ల వెళ్ళగా, అక్కడ వైసీపీకి చెందిన కొందరు టీడీపీ నేతలపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దాడి ఘటనని మహానాడులో వర్ల రామయ్య గుర్తు చేసి, ఏపీలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు. జగన్ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకు వస్తోందన్నారు.

 

అసలే వర్ల రామయ్య మాంచి స్పీకర్, అందుకే తన మాటకారి తనం బాబుకు చూపించాలనే ఉద్దేశంతో జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే మాచర్ల ఘటనతోనే నియంత పాలన నడుస్తుందని వర్ల మాట్లాడుతున్నారు. అదే చంద్రబాబు హయాంలో చింతమనేని ప్రభాకర్ లేడీ తహశీల్దార్‌పైనే దాడి చేశారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వంలో చాలానే ఘటనలు జరిగాయి. మరి అలా జరిగినప్పుడు అవి కూడా నియంత పాలన కిందే వస్తుందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

 

పైగా మాచర్ల ఘటనలో దాడి చేసిన వారిపై కేసు కూడా పెట్టారని,  కానీ చంద్రబాబు హయాంలో అలాంటివేమీ జరగలేదని గుర్తు చేస్తున్నారు. అందుకే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, గత అయిదేళ్లలోనే హిట్లర్ పాలనని ప్రజలు చూశారని అంటున్నారు. ఇప్పుడు జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారని, అది తట్టుకోలేకే ఏదొరకంగా బురద జల్లాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. అయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎవరు హిట్లర్ అనేది ప్రజలు తేల్చేస్తారని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: