ఊహించని విధంగా టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టనున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియానే మొదట ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారని బ్రేకింగ్ ఇచ్చింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు జంప్ అయిపోతున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే వారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారని, జగన్‌ని కలవడమే తరువాయి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ మీడియాలో వచ్చినట్లుగా అదేరోజు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్లలేదు.

 

ఇదే సమయంలో పార్టీ వీడుతున్నట్లు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అనగాని మీడియాకి స్పష్టం చేశారు. తాను హైదరబాద్‌లో ఉన్నానని ఎవరితోనూ చర్చలు జరపలేదని చెప్పారు. అలాగే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ పార్టీలోకి ఏ ఎమ్మెల్యే రావడం లేదని చెప్పారు. తాజాగా కూడా మరోసారి ఎమ్మెల్యేల రాకపై బాలినేని అలాగే మాట్లాడారు. పార్టీలో చేరికలు కేవలం మీడియా సృష్టే అనే అన్నారు. అంటే బాలినేని మాటలు బట్టి చూస్తే పార్టీలో ఎలాంటి చేరికలు లేవని అర్ధమవుతుంది.

 

అయితే అనగాని బయటకొచ్చి, పార్టీ మార్పుపై స్పందించారు కానీ ఏలూరి సాంబశివరావు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్ మీడియా అధికారిక పేజ్‌లో కూడా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. మహానాడు కార్యక్రమం జరుగుతున్న ఆయన జాడ కనిపించలేదు. పర్చూరు పక్కనే ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మహానాడు కార్యక్రమంలో కనిపించారు గానీ, ఏలూరి మాత్రం అడ్రెస్ లేరు.

 

దీని బట్టి చూసుకుంటే ఏలూరి పార్టీ జంప్ ఖాయమని అర్ధమవుతుంది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అంటే మే30న టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే అనుకున్న సమయంకంటే ముందే పార్టీ మారుతున్నట్లు వార్తలు రావడంతో  బాలినేని అలాంటి ప్రకటనలు చేశారని అర్ధమవుతుంది. మొత్తానికైతే ఈ నెలాఖరులో టీడీపీకి షాకులు తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: