వ్యర్థాల వల్ల కాలుష్యమై... మురికి కాల్వల్లా మారిన నదులు మళ్లీ జీవకళను సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సాధించలేనిది... లాక్‌డౌన్‌తో సాధ్యమైంది. దీనికి యమునా నదే ఓ ఉదాహరణ.

 

నదులను మనం దైవంగా భావిస్తాం. నదీ జలాలను పవిత్రంగా చూస్తాం. అయితే, దేశంలో గంగ సహా అనేక నదులు కాలుష్యంతో నిండిపోయాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలు కలవడం వల్ల మురికి కాల్వల్లా మారిపోయాయి. అయితే, నదుల స్వచ్ఛతను పునరుద్ధరిస్తామని... పవిత్రను కాపాడుతామంటూ పాలకులు చెప్పడమే తప్ప ఆచరణలో అది సాధ్యం కాలేదు. 


  
దేశంలో అత్యంత కలుషితమైన నదుల్లో యమునా ఒకటి. యమునా ప్రక్షాళనకు గత 25 సంవత్సరాల్లో 5 వేల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. కానీ... శుద్ధి జరగలేదు. కానీ... కేవలం రెండు నెలల లాక్‌డౌన్‌తో అది సాధ్యమైంది. కరోనా ఆంక్షల వల్ల ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతపడ్డాయి. యమునా నది స్వచ్ఛత సంతరించుకుంది. ఎవరి ప్రమేయం లేకుండా దాని కదే శుభ్రమైంది. కాలుష్యం తగ్గడంతో వేలాదిగా పక్షులు వలస వస్తున్నాయి.

 

యమునా నది ఏడు రాష్ట్రాల మీదుగా దాదాపు 1400 కిలో మీటర్లు మేరకు ప్రవహిస్తుంది. నదీ ఒడ్డున గల కాలనీల మురుగునీరుతో పాటు ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాలు నదిలో చేరుతున్నాయి. హర్యానాలో పానిపట్‌, ఢిల్లీ మధ్య దాదాపు 300 ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు నదిలోకి వచ్చి చేరుతున్నాయి. నది 80 శాతం వరకూ ఢిల్లీ, ఆగ్రా, మధుర మధ్యే కలుషితమవుతోంది. సుందర తాజ్‌మహల్‌ పక్కన ఓ మురికి కాల్వలా కనిపించేది.

 

ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల అంత్యంత ప్రమాదకరమైన నురుగ యమునా నదిపై తెట్టుకట్టేది. అయితే, పర్వదినాల్లో పుణ్య స్నానాల కోసం వచ్చే వాళ్లకు ఈ నురుగ వల్ల ఇబ్బందులు తప్పేవి కాదు. లాక్‌డౌన్‌ వల్ల ఢిల్లీ ప్రాంతంలో గతం కంటే 33 శాతం స్వచ్ఛతను సంతరించుకుంది యమున. మధుర దిశగా సాగితే నది మరింత శుభ్రంగా కనిపిస్తోంది. గత ముప్ఫై ఏళ్లలో తాను నదిని ఇంత స్వచ్ఛంగా ఎప్పుడూ చూడలేదని యమునా యాక్షన్‌ ప్లాన్‌లోని ఓ సభ్యుడు అంటున్నాడు. ఇది సహజసిద్ధంగా నదులకు ఉండే సామర్థ్యం వల్లే సాధ్యమైందంటున్నారు నిపుణులు. 


  
లాక్‌డౌన్‌ ఆంక్షల్ని మెల్లమెల్లగా సడలిస్తుండడంతో యమునా ఒడ్డున గల ఫ్యాక్టరీల్లో మళ్లీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. దీంతో యమున మళ్లీ కాలుష్య కాసారం కాబోతోందనే ఆందోళన వ్యక్తమౌతోంది. వ్యర్థాలు నదిలో కలవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యావరణ వేత్తలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: