అవినీతిని అంతం చేసే లక్ష్యంతో తన పరిపాలన సాగుతుందని.. ఏడాది క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున స్పష్టం చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టి.. ప్రజా ధనాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. దీని కోసం రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. పోలవరం మొదలుకొని వివిధ ప్రాజెక్టుల్లోని అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దీనివల్ల సుమారు రెండు వేల కోట్ల  మేర ప్రజా ధనం వృథా కాకుండా ఆపగలిగింది జగన్ సర్కార్.

 

అధికారంలోకి వచ్చి.. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అవినీతిని అరికట్టే విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పారు జగన్. దీంట్లో భాగంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రకటించారు. అలాగే జూడిషియల్ ప్రివ్యూ ద్వారా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్లో వంద కోట్లు దాటిన ప్రతి ప్రాజెక్టును ఆ ప్రివ్యూ పరిధిలోకి తీసుకెళ్లి పూర్తి స్థాయి స్టడీ చేసిన తర్వాతే టెండర్లను ఖరారు చేస్తామని చెప్పారు సీఎం జగన్. 

 

సీఎం జగన్ చెప్పినట్టుగానే వ్యవహరించారు.  అతి ముఖ్యమైన.. రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నుంచే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారు. దీంతో సుమారు రెండు వేల కోట్ల రూపాయల మేర ప్రజా ధనం వృధా కాకుండా అడ్డుకోగలిగామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.

 

పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించి  782.80 కోట్లు, అలాగే పోలవరం లెఫ్ట్‌ కనెక్టివిటీ  పనుల్లో  58.53 కోట్లు, జెన్‌కో బొగ్గు రవాణాలో  186 కోట్లు, వెలిగొండ రెండో టన్నెల్‌ మిగిలిన పనులకు  61.76 కోట్లు ఆదా చేసింది. అలాగే  డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు , ప్రింటర్ల కొనుగోళ్ళల్లో 65 .47 కోట్లు, జెన్‌కో బొగ్గు పర్యవేక్షణ  25 కోట్లు, 4 జీ సిమ్‌ కార్డులు పోస్ట్‌ పెయిడ్‌  33 .77 కోట్లు, పోతురాజు నాలా డ్రైన్‌ అభివృద్ధి పనుల్లో 15 .62 కోట్లు ఆదా చేసింది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల స్మార్ట్‌ ఫోన్లు కొనుగోళ్లల్లో  83.80 కోట్లు, ఏపీ టీడ్కోలో రివర్స్‌ టెండరింగ్ విధానం ద్వారా  303.31 కోట్లు, అల్లూరుపాడు ప్రాజెక్ట్‌ పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌  67.81 కోట్ల మేర ఆదా చేశారు. అలాగే 503 కోట్లతో చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్‌ లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా  67.9కోట్లు, గాలేరు-నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో  35.3 కోట్లు, గాలేరు-నగరి రెండోదశ రెండో ప్యాకేజీలో  33.57 కోట్లు ఆదా చేసింది జగన్ సర్కార్.

 

రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్ల పాలు కానివ్వకుండా అడ్డుకున్నఘనతను దక్కించుకున్నారు సీఎం జగన్. ఈ నిర్ణయం అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు జరిగిన అవినీతిని ప్రక్షాళన చేసేందుకు తొలి అడుగుగా మారిందనే ప్రశంసలు అందుకున్నారు జగన్.
  

మరింత సమాచారం తెలుసుకోండి: