ఈ నెలాఖరుతో నాలుగో విడత లాక్ డౌన్ ముగుస్తున్న తరుణంలో.. ఐదో విడత లాక్ డౌన్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 11 నగరాలపైనే ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అన్నిరకాల దుకాణాలనూ అనుమతించవచ్చని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

 

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ 4.0 మే 31తో ముగుస్తున్న క్రమంలో అదేరోజు మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూనే లాక్‌డౌన్‌ 5.0ను ప్రధాని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామంటోంది కేంద్రం. 

 

జూన్‌ 1 నుంచి మొదలయ్యే లాక్‌డౌన్‌ 5.0లో.. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌, పుణే, థానే, ఇండోర్‌, చెన్నై, అహ్మదాబాద్‌, జైపూర్‌, సూరత్‌, కోల్‌కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్‌ పెట్టనుంది కేంద్రం. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అహ్మదాబాద్‌, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.

 

లాక్‌డౌన్‌ 5.0లో ప్రార్థనా మందిరాలు తెరవాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రార్ధనా స్ధలాల్లో భారీగా ప్రజలు గుమికూడటం నిషేధిస్తూ కోవిడ్‌-19 నిబంధనలను పాటించేలా వీటిని అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రార్థనా స్ధలాల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయనున్నారు. కాగా జూన్‌ 1 నుంచి అన్ని ప్రార్ధనా స్ధలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయనికి లేఖ రాసింది.

 

లాక్‌డౌన్‌ 4.0లో సెలూన్లకు అనుమతించిన కేంద్రం.. ఐదో విడతలో జిమ్‌లను తెరిచేందుకు అనుమతించనుంది. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో జిమ్‌లను అనుమతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: