టీటీడీ ఇటీవల తీసుకున్న శ్రీవారి భూముల వేలం నిర్ణయం రాజకీయంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు, హిందూ సంఘాలు రచ్చ రచ్చ చేశాయి. దీంతో జగన్ సర్కారు కూడా ఆ వేలం ప్రకటన సహా టీటీడీ తీర్మానాన్ని నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో నేడు పాలక మండలి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.

 

 

తనకు చెడ్డ పేరు తీసుకొచ్చే శ్రీవారి భూముల వేలం నిర్ణయాన్ని సీఎం గట్టిగానే వ్యతిరేకించినట్టు భావిస్తున్నారు. అందుకే.. ఏకంగా ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలను ఆపేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం నిలుపుదల చేయడం కాకుండా.. మొత్తానికి రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న విపక్షాలు ఏం జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది.

 

 

అందుకే.. కలియుగ దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆస్తులపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. టీటీడీ ఆస్తులు విక్రయించాలని తీర్మానాలు చేసింది టీడీపీ పాలనలోని టీటీడీ పాలక మండలి కాదా..? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గత బోర్డు చేసిన తప్పును తమపై రుద్ధి రాజకీయ లబ్ధిపొందాలని చూడడం దారుణమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు పాటుపడుతున్నారని ఆయన చెప్పారు.

 

 

ఇక స్వామి వారి దర్శనం గురించి మాట్లాడుతూ.. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు చెబితే అప్పుడు భక్తలకు స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదాలకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, చాలా ప్రాంతాల వాసులు శ్రీవారి ప్రసాదాలు అందించాలని కోరుతున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: