వైసిపి అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన వ్యవహార శైలి అంతా ముక్కుసూటి గానే ఉంటుంది. మాట తప్పను, మడమ తిప్పను అని మొదటి నుంచి పదేపదే చెబుతూ వస్తున్న జగన్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ నినాదాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తున్నారు. తాను ఎన్నికల ముందు ఏ విధమైన హామీలు అయితే ఇచ్చారో వాటన్నిటిని మొదటి ఏడాదిలోనే దిగ్విజయంగా అమలుచేసి చూపించారు. డైనమిక్ సీఎంగా దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. అన్ని విషయాల్లోనూ పారదర్శకత కోరుకుంటూ, నిజాయితీగా  పరిపాలన అందిస్తూ జగన్ ఏడాది పాలనలో మంచి మార్కులే వేయించుకున్నారు. సీఎంగా జగన్ సమర్థవంతంగా పనిచేస్తున్నా, ఆయనలో ఇక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీకి తాను తగిన సమయం కేటాయించలేక పోతున్నాను అనే బాధ జగన్ లో ఎక్కువగా ఉందట. ప్రస్తుతం సీఎం హోదాలో జగన్ తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలను విజయసాయిరెడ్డి ఒక్కరే చూసుకుంటున్నారు. 

 

IHG

 

పార్టీలో ఎవరైనా వస్తామని సంకేతాలు పంపుతున్నా, లేక ఎవరినైనా పార్టీలో చేసుకోవాలనుకున్నా, మొత్తం అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి ఒక్కరే చూస్తున్నారు. కానీ 22 మంది లోక్ సభ సభ్యులతో వైసీపీ దేశంలో అతి పెద్ద పార్టీగా నాలుగో స్థానంలో ఉంది. ఈ సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల విషయంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకపక్క రాష్ట్ర పార్టీ బాధ్యతలు చూసుకుంటూ కేంద్రంలో చక్రం చెప్పాలంటే అది కాస్త ఇబ్బందికర పరిణామం. అందుకే ఈ విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేసి, ఆ స్థానంలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కి ఆ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారట.

 

 ప్రస్తుతం సజ్జల పార్టీ తరపున మీడియా సమావేశాల్లో పాల్గొంటూ తమపై తరచుగా విమర్శలు చేస్తున్న టిడిపి విమర్శలను తిప్పి కొట్టడంలో ముందుంటున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మంచిదనే ఆలోచనతో జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ సోదరి షర్మిల పేరు కూడా పార్టీ అధ్యక్ష పదవి విషయంలో జగన్ పరిగణలోకి తీసుకున్నా, కుటుంబ పాలన అని ముద్ర తమపై పడుతుందనే ఆలోచనతో సజ్జల పేరు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు నియామకానికి సంబంధించి పార్టీ కీలక నాయకులతో జగన్ చర్చిస్తున్నారట. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా జగన్ కు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: