జగన్ సర్కారు విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం ప్రయత్నిస్తోంది. ఏడాది కాలంలోనే ఆ దిశగా ఎన్నో అడుగులు వేసింది. వాటిలో పూర్తి స్థాయి ఫీజ్‌ రీఎంబర్స్ మెంట్‌ ఒకటి. అంటే ఎవరైనా పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే.. అతడికి పూర్తి గా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది ఓ విప్లవాత్మక నిర్ణయం. గతంలోనూ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అమల్లో ఉన్నా.. దానికి ఓ లిమిట్ ఉండేది. ఆ మిగిలిన సొమ్ము విద్యార్థే కట్టుకోవాల్సి వచ్చేది.

 

 

కానీ జగన్ సర్కారు మొత్తం ఫీజు కడుతోంది. అయితే ఈ పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సమయంలో గోపాల్ అనే వ్యక్తి, ఆయన భార్య వచ్చి కలిశారట. జగన్ ను కలిసి చాలా బాధపడ్డాడట. ఎందుకు బాధపడుతున్నావు అన్నా.. అని అడిగితే.. ఆ ఫ్లెక్సీ నా కొడుకుది.. నా కొడుకు బాగా చదువుతాడు.. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వచ్చాయి. నా కొడుకును ఇంజనీరింగ్‌ చదివించడానికి కాలేజీకి తీసుకెళ్లా.. ఫీజు చూస్తే దాదాపు మెస్‌ ఖర్చులతో కలిపి దాదాపు రూ. 1 లక్షా అవుతుంది. ప్రభుత్వం కేవలం ముష్టి వేసినట్లుగా రూ. 35 వేలు ఇస్తుంది. మిగిలిన డబ్బు అప్పోసొప్పో చేస్తే తప్ప నా పిల్లాడిని చదివించలేని పరిస్థితి..

 

 

నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తరువాత నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావ్‌ అని.. నువ్వు చదువు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి అప్పుతీసుకొచ్చి నా కుమారుడిని కాలేజీలో చేర్పించాను. నేను అప్పు తెచ్చాననే సంగతి నా కొడుకుకు అర్థం అయ్యింది. మొదటి ఏడాది పూర్తయింది.. సెలవులకు ఇంటికి వచ్చాడు.. రెండవ ఏడాది ఫీజుల గురించి ఏ చేయబోతున్నావ్‌ నాన్న అని అడిగాడు.. ఏదో ఒకటి చేస్తానులే నాన్న అని చెప్పాను.. ఎలా చేయబోతున్నాననేది నా కుమారుడికి అర్థం అయ్యింది.. కాలేజీకి వెళ్లాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తన చదువు కోసం నేను అప్పులపాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని గోపాల్ చెప్పి కన్నీరు పెట్టుకున్నాడని జగన్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే జగన్ మదిలో ఈ పూర్తి స్థాయిఫీజురీఎంబర్స్ మెంట్ పథకం రూపుదిద్దుకుందని గద్గద స్వరంతో జగన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: