దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ సగటున నగరంలో 30 కేసులు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలో 107 కరోనా కేసులు నమోదు కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 76 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్నా నగరంలో కొందరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నగరంలో ప్రజలు విందులు, వినోదాలకు తెరతీయడంతోనే కరోనా ముప్పు అంతకంతకూ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 
వనస్థలిపురం, మలక్‌పేట్, తాజాగా పహడీషరీఫ్ ప్రాంతాల్లో ఫంక్షన్లు నిర్వహించగా ఈ మూడు ఫంక్షన్ల ద్వారా దాదాపు 100 మంది కరోనా భారీన పడ్డారు. రాష్ట్రంలో 2098 కేసులు నమోదు కాగా దాదాపు 1400 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో కేవలం 26 రోజుల్లో 29 మంది మృత్యువాత పడ్డారంటే నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
నగరంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా కొందరు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ఉండటం, మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం గమనార్హం. నగరంలో ప్రధానంగా వనస్థలిపురం, మలక్‌పేట్, తాజాగా పహడీషరీఫ్‌ లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా టీఎన్‌ నగర్‌ లో ముంబై నుంచి నగరానికి వచ్చిన ఒక యువతికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో యువతి నివశించే ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. 
 
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో నినన్ రెండు కరోనా కేసులు నమోదు కాగా నారాయణగూడలో ఒకరు కరోనా భారీన పడ్డారు. గోషామహాల్‌ జీహెచ్‌ఎంసీ 14వ సర్కిల్‌ పరిధిలో నిన్న ఇద్దరికి కరోనా నిర్ధారణ కావడంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అల్వాల్ లో నిన్న కరోనా భారీన పడి వృద్ధురాలు మృతి చెందారు. నగరంలో నందిగామ, రాజేంద్రనగర్, బాలాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, సరూర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించిన కరోనా ప్రస్తుతం శంకర్‌పల్లి, మొయినాబాద్, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లో విజృంభిస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: