విశాఖను కకావికలం చేసిన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ పై ఏర్పాటైన విచారణ కమిటీలు నిర్ఘాంతపోయే నిజాలు బయటపెడుతున్నాయి. మొదట్లో యాజమాన్యం నిర్లక్ష్యం ఫోకస్ అవ్వగా.... ఇప్పుడు తలాపాపం తిలాపిడికెడు పంచుకున్న అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. వీటన్నింటి ఆధారంగా సీనియర్ ఐఏఎస్  ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 

 

ఎల్జీ పాలిమర్ ప్రమాదం విశాఖ భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. పరిశ్రమలు పేరు చెబితే నే జనం ఠారెత్తిపోయే వాతావరణం ఏర్పడింది. విషవాయువులు ఎగజిమ్మి 13మంది ప్రాణాల ను బలితీసుకోగా....వందల మంది అనారోగ్యం పాలయ్యారు.   దేశంలోనే తొలిసారి స్టైరీన్ గ్యాస్ వల్ల ప్రమాదం జరగ్గా...... దాని ప్రభావం తీవ్రంగా వుండటం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేసింది. 

 

గ్యాస్ లీక్ వెనుక కారణాలు, నిర్వహణ లోపాలపై లోతైన విచారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు కమిటీలను నియమించాయి. అటు, ఎల్జీ సంస్ధ సాంకేతిక నిపుణుల బ్ర్రందాన్ని దింపి కారణాలను అన్వేషిస్తోంది.  ప్రమాదానికి కారణాలు ఏంటి? మే7న ఏం జరిగింది? అనేదానిపై ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సాంకేతిక నిపుణుల ఇంటర్నల్ కమిటీ  విచారణ జరపి ఇచ్చిన రిపోర్టులో షాకింగ్‌ విషయాలు ఉన్నాయి. 


పరిశ్రమలపై నియంత్రణ, ఆజమాయిషీ కోసం పని చేయాల్సిన డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వైఫల్యం ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఎల్జీ కంపెనీ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, ప్రమాదాలు ఎదురైతే అనుసరించాల్సిన యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ద్ర్రష్టిసారించలేదనే నిర్ధారణకు వచ్చిందని చెప్తున్నారు. 2016 నుంచి ప్రమాదం జరిగే వరకూ ఫ్యాక్టరీస్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన లోపాలు... వాటిని సరిదిద్దేందుకు పాలిమర్స్ కు ఇచ్చిన ఆదేశాలపైన కమిటీ అసంత్ర్రప్తి వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీస్‌, పీసీబీ,  ఫైర్ వి భాగాలు సరైన తనిఖీ విధానాలు పాటించలేదని గుర్తించారు. ఇక పూర్తి స్థాయి వివరాల్ని ఇప్పుడే బయటపెట్టలేమని చెబుతున్నారు కలెక్టర్‌. 

 

స్టైరీన్ ప్రభావిత ఐదు గ్రామాల్లో పరిణామాలను ప్రభుత్వం అంచనా వేయిస్తోంది. ఇక్కడ గాలి,నీరు, భూమి, వాతావరణ పరిస్ధితులపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతను నేషనల్ ఎన్విరాన్ మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి అప్పగించింది. నివేదిక వచ్చే వరకూ ఇక్కడ పొలాల్లో పండించిన కూరగాయలు, పాడి పదార్ధాలను వినియోగాన్ని నిషేధించారు.  నగరానికి నీటి సరఫరా చేసే మేహాద్రిగడ్డ రిజర్వాయర్ జలాలును కూడా ఆపేశారు. వీటిపై సమగ్రంగా పరీక్షలు నిర్వహించి ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. 

 

ఎల్జీ పాలిమర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కంటే ప్రభుత్వ వైఫల్యాలు, అచేతనంగా మారిన వ్యవస్ధ వల్ల వాటిల్లిన నష్టం అధికంగా వుందనే అభిప్రాయం ఇప్పుడు మరింత కలవరపరుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: