దేశంలో ఈ మద్య సైబర్ నేరగాళ్లు బాగా తెలివి మీరారు.. ఎంతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారిని సైతం ఇట్టే బురిడీ కొట్టిస్తూ డబ్బులు లాగుతున్నారు.  కొంత మంది అమాయకంగా తమ అకౌంట్స్ డిటేల్స్ ఇవ్వడంతో ఏకంగా హ్యాక్ చేసి వాళ్ల అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. అయితే సోషల్ మాద్యామల ద్వారా అమాయకులను ముఖ్యంగా మహిళలను మోసం చేసే కేటుగాళ్ళు ఎంతోమంది తయారు అయ్యారు.  ఇలా ఎన్నో సార్లు ఎంతో మంది మోసపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా చేసిన తప్పులే చాలా మంది చేస్తూ మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్​ నగరానికి చెందిన ఓ మహిళకు ఫేస్​బుక్​కు వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్​ను ఆమె యాక్సెప్ట్​ చేసింది.

 

సదరు వ్యక్తి యూకేలో డాక్టర్​ని అంటూ అవతలి వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొంతకాలం వాట్సాప్​లో చాటింగ్ చేస్తూ తన ప్రేమను ఆమెకు వ్యక్త పరిచాడు. త్వరలోనే మీకు ఖరీదైన బహుమతి పంపిస్తానని ఆమెకు ఆశచూపి మెసేజ్ పెట్టాడు.  ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మంచి బహుమతి పంపానని మొబైల్ ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టాడు. అనంతరం దిల్లీ ఎయిర్​పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారిలాగా ఫోన్​చేసి.. మీకు ఒక పార్సిల్ వచ్చిందని... అందులో డాలర్స్ ఉన్నాయని, వాటికి టాక్స్ చెల్లించాలని ఆమెకు తెలిపాడు.

 

మాయగడి మాటలు నిజమే అనుకొని వారు చెప్పినట్టుగా ప్రొసెసింగ్ ఫీజు, ఇన్​కమ్ టాక్స్​ వంటి వివిధ టాక్స్​ల పేరుతో 38 లక్షల రూపాయలు ఆమె ఆన్​లైన్ ద్వారా ట్రాన్స్​ఫర్ చేసింది.  ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని లబో దిబో అన్నది. ఆమె వారికి ఫోన్ చేయగా అది స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు గురువారం హైదరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: