నిమ్మకాయల చినరాజప్ప....టీడీపీ సీనియర్ నేత. సరైన పదవి దక్కకపోయినా సరే....దశాబ్దాల కాలం నుంచి ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఎన్నో ఏళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పనిచేసి, అక్కడ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అలా నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయడంతోనే చంద్రబాబు...2014 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి గెలిచిన రాజప్పకు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నాసరే చినరాజప్ప విజయం సాధించగలిగారు.

 

అయితే రాజప్ప రాజకీయ జీవితంలో ప్రత్యర్ధి పార్టీపైనే దూకుడుగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. అలాంటిది రాజప్ప హఠాత్తుగా వచ్చి ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమంలో సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవుతూ...కొందరికి పరోక్షంగా గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు. మనం చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోయామని, కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదని, దీంతో ఎన్నికల్లో కార్యకర్తలు సైలెంట్ అయ్యారని అందువల్లే మనం ఓడిపోయామని చెప్పారు.

 

కానీ పార్టీ అధికారం కోల్పోగానే కొందరు నేతలు వెళ్లిపోయారని, ఇక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని, ప్రభుత్వంలో లేకుంటే పార్టీ గురించి పట్టించుకోరా? అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అసలు ఎప్పటికైనా పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు. అయితే రాజప్ప ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి కారణాలు ఇవే అని అర్ధమవుతుంది.

 

అసలు ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు నేతలు ఎవరు కార్యకర్తలని పట్టించుకోలేదు. ఎవరికి నచ్చినట్లుగా వారు వ్యక్తిగతంగా లబ్ది పొందే పనిలోనే బిజీగా గడిపారు. దీంతో కార్యకర్తలు ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోయారు. ఫలితంగా పార్టీ ఏదో కొద్ది తేడాతో ఓడిపోవాల్సింది. భారీ తేడాతో పార్టీ ఓడిపోయింది. ఇక ఎన్నికల్లో ఓడిపోయాక..అధికారంలో ఉండగా లబ్ది పొందిన నేతలు వరుస పెట్టి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మాజీ మంత్రులు పార్టీ కోసం కష్టపడటం లేదు. అయినా సరే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలే వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అందుకే రాజప్ప కొందరు సొంత పార్టీ నేతలకు గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: