ఏపీ ముఖ్య‌మంత్రి  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అత్యంత ఇర‌కాటంలో ప‌డేసింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన భూముల అమ్మ‌కం వివాదం. ఈ విష‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారు జ‌గ‌న్ స‌ర్కారు తీరుతో క‌ల‌త చెందారు.అయితే, ఈ విష‌యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. తాజాగా జ‌రిగిన పాల‌క మండలి స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్‌ లో పాలకమండలి సమావేశం జరిగింది. లాక్ డౌన్ కారణంగా అనేక రాష్ట్రాల‌లో ఉన్న పాలకమండలి సభ్యుల సౌలభ్యం కోసం టీటీడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ స‌మ‌యంలోనే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులకు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

 

 

టీటీడీకి చెందిన సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ భూముల‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, దురాక్రమణకు గురైనవి, అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారం శ్వేతపత్రంలో ఉండాలని ఆదేశించారు. దురాక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడమా.. లేక కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ కావడమో జరగాలన్నారు. 2016లో ఆస్తుల విక్రయానికి గత ప్రభుత్వం నియమించిన బోర్డు నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తుల అమ్మకం ప్రక్రియకు సంబంధించి వివిధ దశల్లో ఎక్కడ ఏం జరిగిందో తేల్చేందుకు సమగ్ర విచారణకు కోరుతూ ప్రభుత్వానికి  వెంటనే లేఖ రాయాలని అధికారులను టీటీడీ చైర్మ‌న్‌ ఆదేశించారు.

 

 

ఇదిలాఉండ‌గా, టీటీడీ ఆస్తుల అమ్మకంపై పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తులు, కానుకలు, విక్రయించకూడదని టీటీడీ పాలకమండలి నిర్ణయం వెలువ‌రించింది. నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతమవ్వకుండా ఉండేందుకు కమిటీ నియామకం చేసింది. కమిటీలో పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులు ఉండ‌నున్నారు.  కాగా, తాజా నిర్ణ‌యాల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై భ‌క్తుల్లో విశ్వాసం పెరిగింద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: